కోనసీమ లేటెస్ట్ అప్డేట్.. మళ్లీ టెన్షన్ టెన్షన్

Konaseema Latest Update

మంగళవారం కోనసీమ జిల్లాలోని అమలాపురం అట్టుడికింది. బుధవారం రావులపాలెం రణరంగంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో రావులపాలెంలో పోలీసు బలగాలను మోహరించారు పోలీసులు. అమలాపురం లాగా రావులపాలెంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే లోగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

కోనసీమ జిల్లా పేరు మార్పుని నిరసిస్తూ మంగళవారం అమలాపురంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. బుధవారం కూడా పట్టణంలో నిరసన తెలపాలంటూ కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునివ్వగా పోలీసులు 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేశారు. పట్టణంలోకి ఇతర ప్రాంతాలనుంచి వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. పోలీసు పహారా ముమ్మరం చేశారు. దీంతో అమలాపురంలో ఎలాంటి ఘటనలు కొత్తగా జరగలేదు. అదే సమయంలో కోనసీమ జిల్లా సాధన సమితి నేతలు ఛలో రావులపాలెం కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ కూడా పోలీసులు మోహరించారు. ఈరోజు ఉదయాన్నుంచి రావులపాలెం పోలీసు పహారాలో ప్రశాంతంగానే ఉంది. అయితే సాయంత్రం ఒక్కసారిగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేశారు. రావులపాలెంలో కూడా ఆందోళనలు మొదలు పెట్టారు.

రావులపాలెం పట్టణంలోని కళావెంకట్రావు విగ్రహం వద్ద నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షాపులన్నిటినీ మూసివేయిస్తున్నారు. యువత రోడ్లపైకి రావొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. రావులపాలెంలో ఇప్పటికే 100 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలతో కోనసీమ జిల్లా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది.

ALSO READ: కుట్రదారులు ఆశించింది జరగలేదు