ఫ్రెంచ్ ఓపెన్ లో జోకో జోరు 21వ టైటిల్ రేస్ లో టాప్ గన్

joko-joru-is-the-top-gunman-in-the-21

 

ప్రపంచ టెన్నిస్ పురుషుల గ్రాండ్ స్లామ్ టోర్నీలలో ఓ అరుదైన రికార్డుకు టాప్ ర్యాంక్ ఆటగాడు, సెర్పియన్ వండర్ నొవాక్ జోకోవిచ్ గురిపెట్టాడు. పారిస్ లోని రోలాండ్ గారోస్ వేదికగా జరుగుతున్న 2022 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో తొలిరౌండ్ విజయంతో టైటిల్ వేటను మొదలు పెట్టాడు.

గారోస్ లో 82వ విజయం…

హార్డ్ కోర్ట్ (ఆస్ట్ర్రేలియన్, అమెరికన్ ఓపెన్ ) టెన్నిస్ లో మొనగాడిగా పేరుపొందిన జోకోవిచ్…ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నంబర్ వన్ సీడ్ ఆటగాడిగా బరిలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ నెగ్గాలన్న పట్టుదలతో ఉన్నాడు. తొలిరౌండ్ సమరంలో జపాన్ కు చెందిన 99వ ర్యాంక్ ఆటగాడు

యోషియితో నిషియోకాను 6-3,6-1, 6-0తో చిత్తు చేయడం ద్వారా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ తొలిరౌండ్లో వరుసగా 18వ సీజన్లోనూ నెగ్గడం ద్వారా అజేయ రికార్డును నిలబెట్టుకొన్నాడు.

దిగ్గజఆటగాడు జోకోవిచ్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలిరౌండ్లో కనీసం ఒక్కసారి ఓడకపోడం విశేషం. రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన జోకోవిచ్ కు రోలాడ్ గారోస్ క్లేకోర్టు పోరులో ఇది 82వ గెలుపు కావడం మరో రికార్డు.

9సార్లు సెమీఫైనలిస్ట్…

ఫ్రెంచ్ ఓపెన్లో గత 18 సంవత్సరాలుగా పాల్గొంటూ వస్తున్న జోకోవిచ్ తొమ్మిదిసార్లు మాత్రమే సెమీస్ రౌండ్ వరకూ చేరాడు. 2016, 2021 సీజన్లలో మాత్రమే విజేతగా నిలువగలిగాడు.

ఇప్పటికే మొత్తం 20 గ్రాండ్ స్లామ్ (ఆస్ట్ర్రేలియన్, అమెరికన్ , వింబుల్డన్, ఫ్రెంచ్ ) టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ మరొక్క టైటిల్ సాధించడం ద్వారా 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా నిలవాలని కలలు కంటున్నాడు. అయితే స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్,యువసంచలనం అల్ కరాజ్ ల నుంచి జోకోవిచ్ కు గట్టిపోటీ ఎదురుకానుంది.

రెండుసార్లు కెరియర్ గ్రాండ్ స్లామ్ రికార్డు…

టెన్నిస్ చరిత్రను ఓసారి తిరగేస్తే పురుషుల విభాగంలో ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన) ఘనతను రెండుసార్లు చొప్పున సాధించిన ఆటగాళ్ళలో ఆస్ట్ర్రేలియా దిగ్గజాలు రాయ్‌ ఎమర్సన్‌( 1967 ), రాడ్‌ లేవర్‌ (1969) మాత్రమే ఉన్నారు. ఈ దిగ్గజాల సరసన గత ఏడాదే జోకోవిచ్ నిలువగలిగాడు.

ఓపెన్‌ శకంలో…అదీ 1968 తర్వాత నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన తొలి ఆటగాడిగా జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు. 2016లో తొలిసారిగా ఫ్రెంచ్ఓపెన్ విజేతగా నిలిచిన జోకోవిచ్ మరో క్లే కోర్టు టైటిల్ కోసం 2021 వరకూ వేచిచూడక తప్పలేదు.

అరుదైన గెలుపు…..

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడినా..చివరి మూడు సెట్లూ నెగ్గడం ద్వారా విజేతగా నిలిచిన ఏడవ ఆటగాడిగా జోకోవిచ్ రికార్డుల్లో చేరాడు. గతంలో బెర్నార్డ్‌ (1946), రాడ్‌ లేవర్‌ (1962), జోర్న్ బోర్గ్‌ (1974), ఇవాన్ లెండిల్‌ (1984), ఆండ్రీ అగస్సీ (1999), గాస్టన్ గాడియో (2004) ఈ ఘనత సాధించినవారిలో ఉన్నారు. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పిన జోకోవిచ్ ప్రస్తుత సీజన్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కు దూరమైనా…ఫ్రెంచ్ ఓపెన్ హాట్ ఫేవరెట్లలో ఒకనిగా టైటిల్ రేసులో నిలిచాడు.