బారాముల్లాలో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..

encounter-in-baramulla-three-terrorists-killed

జమ్మూ కాశ్మీర్‌ లోని బారాముల్లా జిల్లాలో కాసేపటి క్రితం భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. పాకిస్తాన్ కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు.. భద్రదళాల చేతిలో హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ చనిపోవడం బాధాకరం. బారాముల్లాలోని క్రీరి ప్రాంతంలో నజీభట్ క్రాసింగ్‌ వద్ద ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

స్థానిక పోలీసులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటిలో దాక్కున్న ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న సైన్యం కాల్పులు మొదలు పెట్టడంతో వారు పారిపోయే ప్రయత్నం చేశారు. హోరాహోరీగా సాగిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్ట్ లు చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ కి చెందిన ఒక పోలీస్ అధికారి సైతం అసువులుబాశాడు.

ముగ్గురూ పాకిస్తాన్ వారే..

ఎన్ కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదులు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైష్-ఎ-మహ్మద్ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. 4 నెలలుగా వీరు యాక్టివ్ ఉన్నారని, భారత్ లో భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారని తెలిపారు జమ్మూ కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారాయన. ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలో 60 మందికి పైగా పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం ఉందని, వీరిని త్వరలో ఏరివేస్తామన్నారు ఐజీపీ విజయ్ కుమార్.

సానుభూతిపరులు అరెస్ట్..

ఎన్ కౌంటర్ కి ఒకరోజు ముందే తీవ్రవాదులకు సహకరిస్తున్న 8మందిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. అవంతిపోరాలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ టెర్రర్ మాడ్యుల్ ను భద్రతా బలగాలు చేధించాయి. వారి నుంచి మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి. వారిచ్చిన సమాచారంతో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టాయి. ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఉద్యోగి అయిన రాహుల్ భట్ ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో కాశ్మీరీ పండిట్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ తో ఉగ్రవాదుల కదలికలు కొన్నాళ్లు ఆగిపోయే అవకాశముంది. అయితే ఉగ్రవాదుల్ని ఏరివేసే వరకు కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతాయని చెబుతున్నాయి భద్రతా బలగాలు.