కుట్రదారులు ఆశించింది జరగలేదు

ap-government-advisor-sajjala-ramakrishnareddy-said-there-was-a-conspiracy-behind-the-amalapuram-incident

అమలాపురంలో జరిగిన ఘటన వెనుక కుట్ర తప్పనిసరిగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటిని కూడా తగలబెట్టారంటే ముందస్తు ప్రణాళికతో వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? అనగానే.. టీడీపీ, జనసేన భుజాలు తడుముకుంటున్నాయన్నారు.

టీడీపీ, జనసేన శక్తులు ఉన్నాయని తాము పూర్తిగా నమ్ముతున్నామన్నారు. పోలీసుల వైఫల్యం లేదని, పోలీసులు సంయమనంతో వ్యవహరించారని.. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండడానికి అమలాపురం ఏమి సరిహద్దు ప్రాంతం కాదని, ప్రశాంతంగా ఉండే ప్రాంతమని అలాంటి చోట హఠాత్తుగా దాడి చేయడంతో ఆపడంలో కాస్త ఆలస్యం అయిందే గానీ.. దాన్ని ఆ తర్వాత ఎదుర్కోవడంలో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారన్నారు.

పోలీసులు, వైసీపీ నాయకులు సంయమనం పాటించడం వల్లనే.. కుట్రదారులు ఆశించినట్టు పరిస్థితి చేయి దాటలేదన్నారు. నిన్న ఘటనలో పాల్గొన్న వారెవరూ తప్పించుకోలేరని, ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. నిందితుల పట్ల ఎంత కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుందో చూడబోతున్నారన్నారు.

నిన్నటి ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ పవన్ కల్యాణ్ అనడాన్ని ప్రస్తావించగా.. అలాంటి విమర్శలు చేస్తున్నారంటే అంతకు మించిన నికృష్టులు ఎవరూ ఉండరని సజ్జల విమర్శించారు. అంతమంది చుట్టుముట్టినప్పుడు తుపాకులు తీసుకుని కాల్చడం పోలీసులకు కష్టమేమీ కాదని.. కానీ నిగ్రహాన్ని ప్రదర్శించి పరిస్థితి చాలా దూరం వెళ్లకుండా కట్టడి చేశారన్నారు. అంబేద్కర్ పేరును అనవసరంగా వివాదంలోకి తెచ్చారంటున్న పార్టీలు.. మరి జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ రాజకీయ పార్టీలే మొన్నటి వరకు డిమాండ్ చేశాయని గుర్తు చేశారు.