డెడ్‌బాడీని చితక్కొట్టిన ఎమ్మెల్సీ

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసింది ఎమ్మెల్సీ అనంతబాబేనని పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్య జరిగిన తీరును, ఎమ్మెల్సీ వాంగ్మూలం వివరాలను వెల్లడించారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం..

హత్య జరిగిన రోజు రాత్రి 8 సమయంలో సుబ్రహ్మణ్యం తన తల్లికి చెప్పేసి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అనంతరం శ్రీరాంనగర్‌లోని ఒక స్కూల్ వద్ద వారంతా మద్యం సేవించి తిరిగి రోడ్డు మీదకు వచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అటుగా వచ్చారు. సుబ్రహ్మణ్యంను చూసి పలకరించిన ఎమ్మెల్సీ అతడిని తన కారులో ఎక్కించుకున్నారు. జన్మభూమి పార్కు సమీపంలో టిఫిన్ కట్టించుకుని తిరిగి కారు ఎక్కారు. కారు డ్రైవింగ్‌ను సుబ్రహ్మణ్యంకు అప్పగించారు ఎమ్మెల్సీ.

ఆ సమయంలో తనకు ఇవ్వాల్సిన 20 వేలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కోరారు. నీ ప్రవర్తన సరిగా లేదు.. ఇప్పుడు కూడా మద్యం తాగావ్, వాసన వస్తోంది. నీ తీరు సరిగా ఉంటే తిరిగి పనిలోకి తీసుకునేవాడిని అని ఎమ్మెల్సీ అనంతబాబు అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అనంతరం ఇంటి వద్ద కారు దిగే సమయంలో మరోసారి సుబ్రహ్మణ్యంపై ఎమ్మెల్సీ అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుబ్రహ్మణ్యం కూడా మద్యం మత్తులో ఉండడంతో ఎమ్మెల్సీపై తిరగబడ్డారు. దాంతో అహం దెబ్బతిన్న అనంతబాబు కోపంతో సుబ్రహ్మణ్యంను గట్టిగా వెనక్కు తోసేశారు. వెనక్కు కింద పడిన సమయంలో సుబ్రహ్మణ్యం తలకు గాయమైంది. దాంతో సహనం కోల్పోయిన సుబ్రహ్మణ్యం తననే కొడుతావా అంటూ మరోసారి ఆగ్రహంతో ఎమ్మెల్సీ మీదకు రాబోయాడు. దాంతో ఎమ్మెల్సీ అనంతబాబు.. మెడ పట్టుకుని మరోసారి గట్టిగా తోయడంతో సుబ్రహ్మణ్యం తల డ్రైనేజీ గట్టుకు గట్టిగా తాకింది. గట్టి దెబ్బ తగిలి తల వెనుక రక్తం రావడం మొదలైంది.

దాంతో అనంతబాబే సుబ్రహ్మణ్యంను తన కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రెండు ఆస్పత్రులు మూసి ఉండడంతో మరింత ముందుకెళ్లారు. ఆ సమయంలో వెనుక సీట్లో ఉన్న సుబ్రహ్మణ్యంకు వెక్కిళ్లు వచ్చాయి. కొద్దిగా నీరు తాగించారు ఎమ్మెల్సీ. కొద్దిసేపటికి వెక్కిళ్లు కూడా ఆగిపోవడంతో .. శ్వాస, నాడీని పరిశీలించి సుబ్రహ్మణ్యం చనిపోయినట్టు అనంతబాబు నిర్ధారించుకున్నారు.

హత్య తన మీద పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. యాక్సిడెంట్ నాటకానికి తెర లేపారు. గతంలోనూ మద్యం సేవించిన సమయంలో సుబ్రహ్మణ్యం రెండుమూడు సార్లు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని ఈసారి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్‌కు గురయ్యాడని నమ్మించాలని భావించారు.

యాక్సిడెంట్ అని నమ్మించాలంటే శరీరంలో గాయాలు ఉండాలని భావించిన ఎమ్మెల్సీ.. శవాన్ని కారుతో డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఒక కర్ర తీసుకుని శరీరాన్ని చితక్కొడ్డాడు. అనంతరం కారులో శవాన్ని చేర్చి.. సుబ్రహ్మణ్యం సోదరుడికి ఫోన్ చేశారు. సుబ్రహ్మణ్యంకు యాక్సిడెంట్ అయినట్టు సమాచారం వచ్చింది.. అతడిని తాను అమృత ఆస్పత్రికి తీసుకెళ్తున్నాను అక్కడికి రండి అని సమాచారం ఇచ్చారు. అమృత ఆస్పత్రి వైద్యులు పరిశీలించి సుబ్రహ్మణ్యం చనిపోయినట్టు నిర్ధారించారు.

అక్కడి నుంచి తన కారును సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వాచ్‌మెన్‌ గా పనిచేస్తున్న అపార్ట్‌మెంట్‌ వద్దకు తీసుకెళ్లారు. ఒంటిపై గాయాలు చూసి అనుమానం వచ్చిన డ్రైవర్ కుటుంబసభ్యులు ఎమ్మెల్సీతో దాదాపు గంట పాటు వాగ్వాదానికి దిగారు. హత్య చేశారంటూ వాదించారు. ఏమి చేయలేకపోయిన ఎమ్మెల్సీ.. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తన కారును అక్కడే వదిలేసి ఇతరుల బైక్‌పై వెళ్లిపోయారు.