ఢిల్లీని ముంచిన ముంబై.. బెంగళూరుకు ప్లే-ఆఫ్ జాక్ పాట్

టాటా-ఐపీఎల్ 15వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ కు రంగం సిద్ధమయ్యింది. మొత్తం 10 జట్లు, 70 మ్యాచ్ ల లీగ్ లో..మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరిన జట్లు ఏవో తేలిపోయాయి

ఇవీ ఆ నాలుగు జట్లు..
లీగ్ దశలోని మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ ల్లో 10 విజయాలు, 4 పరాజయాలతో 20 పాయింట్లు సాధించడం ద్వారా గుజరాత్ టైటాన్స్ జట్టు టేబుల్ టాపర్ గా ప్లే ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించగా…మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ 14 రౌండ్లలో 9 విజయాలు, 18 పాయింట్లతో రెండోస్థానంలో నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్లో అడుగు పెట్టింది. రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 14 రౌండ్లలో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించినా రాజస్థాన్ కంటే రన్ రేట్ తక్కువగా ఉండడంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు..నిర్ణయాత్మక 14వ రౌండ్ లో నెగ్గితీరాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్ ను ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో కంగు తినిపించడంతో..అనూహ్యంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నాలుగోస్థానంలో నిలిచిన జట్టుగా ప్లేఆఫ్ బెర్త్ అందుకోగలిగింది.

2018లో ఢిల్లీ- 22లో ముంబై..
2018 ఐపీఎల్ ఆఖరిరౌండ్ మ్యాచ్ లో నెగ్గితీరాల్సిన ముంబైని ఢిల్లీజట్టు కంగుతినిపించడం ద్వారా ప్లేఆఫ్ రౌండ్ ఆశల్ని గల్లంతు చేసింది. అయితే.. ప్రస్తుత ఐపీఎల్ లో మాత్రం ఢిల్లీపై నెగ్గడం ద్వారా ముంబై..ప్రత్యర్థి ప్లేఆఫ్ ఆశల్ని వమ్ము చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 14 రౌండ్లలో 7 విజయాలు, 7 పరాజయాలతో 14 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 5వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక..కోల్ కతా నైట్ రైడర్స్ 14 రౌండ్లలో 6 విజయాలు సాధించడం ద్వారా 6వ స్థానంలో కొనసాగుతోంది. కింగ్స్ పంజాబ్- హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య జరిగే ఆఖరి ( లీగ్ 70వ ) రౌండ్ మ్యాచ్ ద్వారా 7, 8 స్థానాలలో నిలిచే జట్టు ఏదో తేలనుంది.

చెన్నై, ముంబై దొందూ దొందే!
ఐపీఎల్ గత 14 సీజన్లలో ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్, నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ జట్ల పరిస్థితి ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. ప్రస్తుత 15వ సీజన్ లీగ్ లో ఈ రెండు దిగ్గజజట్లు ఘోరపరాజయాలతో లీగ్ టేబుల్ ఆఖరి రండుస్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ గా ప్రస్తుత సీజన్ బరిలో నిలిచిన చెన్నైజట్టు.. 14 రౌండ్లలో 4 విజయాలు, 10 పరాజయాలతో 8 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 9వ స్థానానికి పడిపోయింది. ఇక..ముంబై ఇండియన్స్ సైతం 14 రౌండ్లలో 4 విజయాలు, 8 పాయింట్లతో 10వ స్థానానికి పరిమితమయ్యింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై వరుసగా 9 పరాజయాలు చవిచూడటం, లీగ్ టేబుల్ ఆఖరిస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. గొప్పగొప్ప విజయాలు సాధించిన ముంబైజట్టు..చెత్త పరాజయాలు మూటగట్టుకొన్న జట్టుగానూ మిగిలిపోయింది.

ఇదీ ప్లే-ఆఫ్ లైనప్..
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 24న జరిగే క్వాలిఫైయర్ -1 సమరంలో లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్,రెండోస్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో నెగ్గినజట్టు నేరుగా టైటిల్ సమరానికి బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది. అదే ఓడినజట్టుకు ఫైనల్ చేరటానికి క్వాలిఫైయర్ -2వ రౌండ్ రూపంలో మరో అవకాశం మిగిలే ఉంటుంది. మే 25న కోల్ కతా వేదికగానే జరిగే ఎలిమనేటర్ రౌండ్లో లీగ్ టేబుల్ మూడు , నాలుగు స్థానాలలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు ఢీ కోననున్నాయి. కాగా.మే 27న అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫైయర్-2 లో ఎలిమనేటర్ రౌండ్ విన్నర్ తో తొలి క్వాలిఫైయర్ రౌండ్లో ఓడినజట్టు తలపడనుంది. మే 29న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టైటిల్ సమరం జరుగనుంది.

ALSO READ: భళా!..భారత మహిళ! ప్రపంచ బాక్సింగ్ లో పతకాల జోరు