యువ హీరోల మాస్ మంత్రం..!

కొన్నేళ్ల కిందటి వరకు టాలీవుడ్ లో అగ్రహీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎక్కువగా మాస్ చిత్రాల్లో నటించేవారు. అయితే కొన్నేళ్ల కిందటి నుంచి ట్రెండ్ బాగా మారిపోయింది. కొత్త దర్శకుల రాకతో విభిన్న తరహా చిత్రాల నిర్మాణం టాలీవుడ్లో జరుగుతూ వచ్చింది. అటువంటి సినిమాలతోనే బాలీవుడ్ లో సైతం మెప్పించడం జరిగింది.

అయితే ఇప్పుడు టాలీవుడ్ యువ హీరోలు మళ్ళీ మెల్లమెల్లగా మాస్ చిత్రాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మాస్ చిత్రాలతోనే క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ తో ఒక పక్క మాస్ చిత్రం చేయనుండగా, అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప- 2, ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాడు. అలాగే చరణ్ శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమా చేయనున్నాడు. ఇప్పుడు స్టార్ హీరోల బాటనే యువ హీరోలు కూడా పయనిస్తున్నారు. వారు కూడా వరుసగా మాస్ చిత్రాలు చేస్తున్నారు.

తన కెరీర్ లో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలను చేసిన నితిన్ ఉన్నట్టుండి మాచర్ల నియోజకవర్గం అంటూ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక నాని తన కెరీర్ లో వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడు కూడా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే పక్కా మాస్ చిత్రంలో నటిస్తున్నాడు. తమిళంలో మాస్ చిత్రాల దర్శకుడిగా లింగస్వామి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో యువ హీరో రామ్ ది వారియర్ అనే యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. తెలుగులో ఊర మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు రామ్ అంగీకారం తెలిపాడు.

ఇక మెగా హీరో వరుణ్ కూడా తొలి నుంచి విలక్షణమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వరుణ్ తొలిసారిగా ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సుధీర్ బాబుతో దర్శక నటుడు హర్ష వర్ధన్ ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇలా వరుసగా చిన్న హీరోలు కూడా మాస్ చిత్రాలు చేస్తున్నారు. ఇంకా నిఖిల్ సిద్ధార్థ్, సందీప్ కిషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ల లైనప్ లో కూడా యాక్షన్ సినిమాలు ఉన్నాయి.