మేజర్ లో పాత్ర బయటపెట్టిన హీరోయిన్

మేజర్ సినిమాలో సయీ మంజ్రేకర్ తో పాటు మరో హీరోయిన్ గా నటించింది శోభిత ధూలిపాళ్ల. ఈ సినిమాలో తన రోల్ ఏంటి, దాని షేడ్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని బయటపెట్టింది.

“మేజర్ లో ప్రమోద అనే పాత్రలో కనిపిస్తా. సినిమాలో ఒక పక్క సందీప్ జీవితం చూపిస్తూ.. మరో పక్క 26/11 దాడులు, తాజ్ ఇన్సిడెంట్ ని సమాంతరంగా చూపిస్తారు. నేను 26/11 ఎటాక్స్ లో బందీగా కనిపిస్తా. భయం ,ఏడుపు , ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ .. ఇలా బోలెడు కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. భావోద్వేగాలలో చాలా బరువైన పాత్ర. నిజ జీవితంలో ఒక వ్యక్తి దాడులని, బాధని ఎదురుకున్నారు. కాబట్టి కేవలం సినిమాటిక్ గా కాకుండా ఒక బాధ్యతతో చేసిన పాత్ర.”

ఇలా మేజర్ లో తన పాత్ర ఛాయల్ని బయటపెట్టింది శోభిత. గతంలోనే అడివిశేష్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న ఈ ముద్దుగుమ్మ.. రియల్ లైఫ్ స్టోరీల్లో నటిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటోంది.

“నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా చేస్తున్నపుడు రిఫరెన్స్ వుండదు. కానీ ఒక యాక్టర్ గా నేను బలంగా నమ్మేది ఏమిటంటే..,ఇది యాదార్ధంగా జరిగింది. నేను చేస్తున్న పాత్ర బాధ, భయాన్ని ఒకరు నిజంగా అనుభవించారు. ఈ ఘటన తర్వాత వారి జీవితం పూర్తిగా మారిపోయింది వారికి గౌరవం ఇవ్వాలి అని ఈ పాత్రని పూర్తిగా మనసుపెట్టి చేశా. నా కెరీర్ లో కన్నీళ్ళ కోసం నేను ఎప్పుడూ గ్లిజరిన్ వాడలేదు. ఈ కథని అనుభవించిన తర్వాత జీవితంలో నాకు గ్లిజరిన్ అవసరం వుండదు.”

పాన్ ఇండియా సినిమాగా వస్తోంది మేజర్ మూవీ. ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు నిర్మాత.