నాకు అదే పెద్ద కిక్కు – పరశురామ్

parasuram

కలెక్షన్లు కిక్ ఇస్తాయా.. ప్రశంసలు క్లిక్ ఇస్తాయా? దర్శకుడు పరశురామ్ కు ఎదురైన ప్రశ్న ఇది. సర్కారువారి పాట సినిమాకు సంబంధించి ఈ రెండూ కాదంటున్నాడు ఈ దర్శకుడు. మహేష్ బాబును డైరక్ట్ చేయడమే తనకు అతి పెద్ద కిక్ అని చెబుతున్నాడు.

“సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేశాననేది నా మొదటి కిక్కు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం సెకండ్ కిక్. మహేష్ గారిని కొత్తగా చూపించారని ఫ్యాన్స్ ఆనందపడటం థర్డ్ కిక్. ఇక బాక్సాఫీసు నెంబర్లు అంటే అది మహేష్ గారికి ఉన్న స్టార్ డమ్.. కథ జనాల్లోకి చొచ్చుకు వెళ్ళడం వల్ల సాధ్యమైంది. సినిమా రెండో వారంలో ఉంది. ఇప్పటికీ అద్భుమైన షేర్స్ లో వుంది సర్కారు వారి పాట.”

ఇలా తన ఆనందాన్ని బయటపెట్టాడు పరశురామ్. బరువైన కథను తేలిగ్గా చెప్పడం వెనక రీజన్ పై స్పందిస్తూ, ప్రతి దర్శకుడికి ఓ స్టయిల్ ఉంటుందని, ఇలా తేలిగ్గా చెప్పడం తన స్టయిల్ అంటున్నాడు.

“ఒకొక్కరిది ఒక్కో స్టయిల్. థియేటర్ లోకి వచ్చిన వారిని ఆహ్లాదపరుస్తూ చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పడం నాకు ఇష్టమైన స్టయిల్. ప్రేక్షకులు నవ్వాలి. ఆనందంగా వుండాలి. మనం చెప్పాలనుకున్న పాయింట్ కూడా చెప్పాలి. ఇదే నాకిష్టం. సర్కారు వారి పాటకు రిపీట్ ఆడియన్స్ రావడానికి కారణం కూడా సినిమాలో వున్న వినోదమే.”

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ఉంది. కాకపోతే ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. ఈ శని, ఆదివారాల్లో సినిమా గట్టిగా ఆడితే.. సోమవారం నాటికి ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కష్టమే. ఎందుకంటే, వచ్చే వారం ఎఫ్3 సినిమా థియేటర్లలోకి వస్తోంది. కచ్చితంగా మహేష్ సినిమాకు పోటీ ఇస్తుంది.