లాంగ్ గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చిన కృష్ణ

వయోభారం వల్ల ఇంటికే పరిమితమయ్యారు సూపర్ స్టార్ కృష్ణ. పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బయట తిరగడం తగ్గించేశారు. ఈమధ్య సర్కారువారి పాట సినిమా చూసినప్పటికీ బయట కనిపించలేదు. అలా చాన్నాళ్లుగా కెమెరా కంటికి కనిపించని కృష్ణ, లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి కనిపించారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.

ప్రముఖ పీఆర్వో, పాత్రికేయుడు, నిర్మాత బీఏ రాజు భౌతికంగా దూరమై ఏడాది గడిచింది. ఈ సందర్భంగా బీఏ రాజుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు కృష్ణ. బీఏ రాజును తను ఎలా కలిశారు, ఎలా పైకి తీసుకొచ్చారు లాంటి ఆసక్తికర విశేషాల్ని పంచుకున్నారు.

“బిఏ రాజు నా అభిమాని. నేను బెజవాడ ఎప్పుడు వెళ్ళినా నన్ను కలిసేవాడు. ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇవ్వడానికి నేనే అతన్ని మద్రాస్ తీసుకొచ్చాను. చాలా సంవత్సరాలు ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇచ్చేవాడు. నాకు ఫ్యాన్స్ ని ఎక్కువగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందండి, ఏదన్నా పేపర్ కు రెకమండ్ చేయండి అని అంటే నేనే జ్యోతిచిత్ర కు సిఫారసు చేశాను. తర్వాత రకరకాల పేపర్ లలో పని చేశాడు. ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు పెంచుకుని జర్నలిస్ట్ గా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా సూపర్ హిట్ పత్రిక పెట్టి, ఆ పత్రికను తెలుగు సినిమా పత్రికల్లో నంబర్ 1 పత్రికగా తీర్చిదిద్దాడు. సూపర్ హిట్ పత్రిక ఎంత ఫేమస్ అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు, చికాగో లో ఇండియన్ స్ట్రీట్ లో అన్నీ ఇండియన్ షాపులు ఉండేవి. అందులో పేపర్లు అమ్మే తెలుగు షాపు ఒకటి ఉంది. అందులో ఆదివారం ఎడిషన్ ఈనాడు, సూపర్ హిట్ ఈ రెండే తెలుగు పేపర్లు ఉన్నాయి. అమెరికాలో కూడా పాపులర్ అయ్యేంతగా డెవలప్ చేశాడు సూపర్ హిట్ ని. తర్వాత నిర్మాతగా సినిమాలు కూడా తీశాడు. చాలా అభివృద్ధి లోకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇంత త్వరగా మనందరినీ విడిచి అతను వెళ్లిపోవడం చాలా బాధాకరం.”

ఇలా బీఏ రాజును మరోసారి గుర్తుచేసుకున్నారు కృష్ణ. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆయన వీడియో వైరల్ అయింది. చాన్నాళ్ల తర్వాత కృష్ణను చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: చరణ్ చేతుల మీదుగా కమల్ సినిమా ప్రచారం