చరణ్ చేతుల మీదుగా కమల్ సినిమా ప్రచారం

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. ఈ సినిమా కోసం తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనుండగా సూర్య అతిధి పాత్రలో అలరించనున్నారు.

హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 3న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ ‘విక్రమ్’ సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని ప్లాన్ చేస్తుంది.

ఇప్పుడీ సినిమాకు ప్రచారకర్తగా మారాడు హీరో రామ్ చరణ్. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ట్రయిలర్ ను తన చేతులమీదుగా లాంఛ్ చేశాడు. సినిమా యూనిట్ తో పాటు, తన ఫ్రెండ్ నితిన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

శ్రేష్ట్ మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ విక్రమ్ సినిమాని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయడంతో సినిమా కచ్చితంగా సేఫ్ జోన్ లోకి వెళ్తుందని ట్రేడ్ భావిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. కమల్ స్వయంగా ఓ పాట పాడారు.