వైసీపీ ఎమ్మెల్సీపై అనుమానాలు. మృతి వెనుక కారణాలు అవేనా?

వైసీపీ ఎమ్మెల్సీపై అనుమానాలు

మాజీ డ్రైవర్‌ మృతి.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మెడకు చుట్టుకుంటోంది. రంపచోడవరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ అక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేసిన కాపు నేత అనంతబాబుకు వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.

అనంతబాబు దగ్గర సుబ్రమణ్యం ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేశాడు. మూడు నెలల క్రితమే మానేశాడు. ఉద్యోగం మానేసే సమయానికి ఎమ్మెల్సీ అనంతబాబుకు డ్రైవర్‌ సుబ్రమణ్యం 20వేల రూపాయలు బాకీ పడ్డారు. ఆ డబ్బు విషయంలో పదేపదే ఫోన్ చేసి తమను ఎమ్మెల్సీ బూతులు తిట్టేవారని మృతుడి తల్లితో పాటు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

రాత్రి పదిన్నర సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి సుబ్రమణ్యంను కారులో తీసుకెళ్లాడు. రాత్రి ఒకటిన్నర సమయంలో సుబ్రమణ్యం సోదరుడికి ఫోన్ చేసిన అనంతబాబు… రాత్రి టిఫిన్ కోసం బైక్‌లో పంపగా రోడ్డు ప్రమాదంలో సుబ్రమణ్యం చనిపోయాడని సమాచారం ఇచ్చారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకుని..

సుబ్రమణ్యం తల్లిదండ్రులు కాపలాదారులుగా పనిచేస్తున్న అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లారు ఎమ్మెల్సీ. వారికి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రయత్నించగా.. బంధువులు, స్థానికులు ఎమ్మెల్సీని ఘెరావ్ చేశారు.

యాక్సిడెంట్ జరిగితే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, పోలీసులకు చెప్పకుండా మృతదేహాన్ని నేరుగా ఇక్కడికి ఎలా తీసుకొచ్చారని ప్రశ్నించారు. తాను ఆస్పత్రికి తీసుకెళ్లానని.. ఆస్పత్రి ఎంట్రీలోనే డాక్టర్ పరీక్షించి చనిపోయాడని చెప్పారని, దాంతో తాను ఇక్కడికి తీసుకొచ్చానని అనంతబాబు చెప్పారు. అందరూ చుట్టుముట్టడంతో మృతదేహాన్ని తీసుకొచ్చిన కారును అక్కడ వదిలేసి వేరే కారులో వెళ్లిపోయారు.

ఇది ముమ్మాటికీ హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహంపై ఇసుక ఉందని… బీచ్‌లో కొట్టి చంపి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన రహస్యాలన్నీ తన భర్తకు తెలుసని, అనంతబాబు ఏఏ మహిళలతో ఉంటారన్నది కూడా తెలుసని…

అన్నీ తెలిసిన తన భర్త డ్రైవర్ ఉద్యోగం మానేయడాన్ని ఎమ్మెల్సీ జీర్ణించుకోలేకపోయారని ఆమె చెబుతున్నారు. 20వేల రూపాయలు అప్పు తీర్చాలంటూ పదేపదే ఒత్తిడి తెచ్చారంటున్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన బలహీనతలన్నీ డ్రైవర్ సుబ్రమణ్యంకు తెలుసని.. అలాంటి వ్యక్తి తన వద్ద పని మానేసి వెళ్తే ఆ రహస్యాలన్నీ బయటి ప్రపంచానికి తెలిసిపోతాయన్న భయంతోనే ఈ హత్య చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఇప్పటి వరకు ఎమ్మెల్సీ అనంతబాబు ఈ ఘటనపై బయటకు వచ్చి మాట్లాడలేదు. పైగా యాక్సిడెంట్ అయిన బైక్ ఎక్కడుందన్నది ఇంకా తెలియడం లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.