మ‌తం త‌ప్ప.. ధ‌ర‌లు ప‌ట్ట‌వా..?

senior-congress-leader-shashi-tharoor-has-drawn-up-a-table-on-the-prices-between-bjp-and-congress-government

ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయి, ధరలు ఆకాశాన్నంటడంతో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. మరి భారత్ పరిస్థితి ఏంటి..? భారత్ లో నిత్యావసరాల ధరలు ఎలా ఉన్నాయి. సామాన్యుడు వాటిని భరించగలడా..? ప్రతి రోజూ ఆ భారాన్ని మోయగలడా..? ప్రజలే ఈ తేడా గమనించండి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఓ పట్టిక రూపొందించారు. యూపీఏ, ఎన్డీఏకి తేడా ఇదే.. ప్రతిరోజూ ఇది మీరు గమనించొచ్చు అని చెప్పారు.

గత కాంగ్రెస్ హయాంలో దశాబ్దాలుగా ఆగిపోయిన అభివృద్ధి ఎన్డీఏ హయాంలోనే జరిగిందని చెబుతుంటారు బీజేపీ నేతలు. అయితే ఆ అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాల పెంపులో కాదు, ద్రవ్యోల్బణం పెంపులో అంటూ ఎప్పటికప్పుడు చురకలంటిస్తుంటారు కాంగ్రెస్ నేతలు. తాజాగా శశిధరూర్ బయటపెట్టిన ధరల పట్టిక కూడా అలాంటిదే.

ఇంతకీ ఆ పట్టికలో ఏముందంటే..

వస్తువు పేరు 2014 ధర – 2022లో ధర పెరుగుదల శాతం
బియ్యం(కేజీ) – రూ.26.17 – రూ.35.85 37
గోధుమ పిండి(కేజీ) – రూ.20.5 – రూ.28.01 37
పాలు(లీటర్) – రూ.35.53 – రూ.50.7 43
వేరు శెనగ నూనె(ప్యాకెట్) – రూ.122.08 – రూ.183.81 51
ఆవ నూనె – రూ.95.39 – రూ.183.19 92
వనస్పతి నూనె – రూ.73.47 – రూ.160.17 118

టమోటాలు, ఉల్లిపాయల రేట్లు ఎన్డీఏ హయాంలోనే చుక్కలనంటుతాయనే ఆనవాయితీ ఎలాగూ ఉంది. అలాంటివే కాకుండా నిత్యావసరాలన్నీ ఇప్పుడు మధ్యతరగతికి కూడా అందకుండా పెరిగిపోయాయి. రోజువారీ వాడుకునే టీపొడి, ఉప్పు, పప్పు, పాలు.. వంటి వాటి రేట్లు కూడా దారుణంగా పెరిగాయని, ఆ తేడా మీరే గమనించండి అంటున్నారు శశిధరూర్.

కాంగ్రెస్ హయాంలో రేట్లు పెరగలేదా అంటే.. మరీ ఇంత దారుణంగా మాత్రం పెరగలేదనే చెప్పాలి. ఇక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అంతర్జాతీయ మార్కెట్ కి అనుగుణంగా పెరిగాయని చెబుతారే కానీ, ప్రపంచ మార్కెట్ లో రేట్లు తగ్గినప్పుడు ఆ లాభం మాత్రం కేంద్రమే తన జేబులో వేసుకుంది. ప్రజల్ని దారుణంగా వంచించిందనే విమర్శలున్నాయి. ఈ దారుణాలను కప్పి పుచ్చుకోడానికే ఇప్పుడు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఎన్నికల సమయానికి మత చిచ్చు రగిల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా శశిధరూర్ మాత్రం క్లియర్ పిక్చర్ చూపించారు. ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు.