నేనే వైసీపీ అభ్యర్థిని. ప్రకటించుకున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే

గన్నవరం వైసీపీలో గ్రూపు తగాదాలను పరిష్కరించేందుకు వైసీపీ నాయకత్వం ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగానే … టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని తానేనని ప్రకటించుకున్నారు. ఇక్కడ దుట్టా రామచంద్రకు వంశీకి పొసగడం లేదు.

వంశీతో కలిసి పనిచేయలేమని ఇప్పటికే పార్టీ పెద్దలకు దుట్టా స్పష్టం చేశారు. వంశీ మట్టి తవ్వకాలు జరుపుతున్నారంటూ కలెక్టర్‌కు దుట్టా ఫిర్యాదు కూడా చేశారు. తమకు వంశీ వద్దు… కొత్త ఇన్‌చార్జ్ కావాలంటూ వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ కూడా తీశాయి.

ఈ పరిణామాలపై స్పందించిన వల్లభనేని వంశీ… మట్టి తవ్వకాల్లో తన ప్రమేయం లేదన్నారు. దీనిపై కలెక్టర్‌కు కాకపోతే సీబీఐకి, ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు. అర్థం పర్థం లేని ఆరోపణలపై తాను పెద్దగా స్పందించబోనన్నారు.

వైసీపీ పాత నాయకులను తొక్కేసి, టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలకు స్పందించిన వంశీ… తాను మూడు సార్లు ఎన్నికలు ఫేస్ చేశానని… ఎవరిని ఎక్కడ వాడుకోవాలో తనకు బాగా తెలుసన్నారు. తానేమీ ఎన్నికలు అనగానే పారిపోయి ఇంట్లో దాక్కున్న వ్యక్తిని కాదన్నారు. తనతో పాటు వైసీపీ కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరూ .. ఇప్పుడు వైసీపీ వారేనన్నారు. 16ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న తనకు కొత్తగా వీరి కోచింగ్ అవసరం లేదన్నారు.

గన్నవరం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించింది ఎవరో అందరికీ తెలుసన్నారు. తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. పైగా జగనన్న కాలనీలకు మట్టిని తవ్వుతుంటే వాటిని కూడా దుట్టా అల్లుడు అడ్డుకుంటున్నారని వంశీ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా బైక్‌ ర్యాలీలు కాకపోతే.. బస్సు ర్యాలీలు పెట్టుకోమనండి అంటూ వంశీ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ అభ్యర్థిని తానేనని ప్రకటించారు.