దిశ ఎన్‌కౌంటర్ ఫేక్‌.. కమిషన్ నివేదిక

దిశ ఎన్‌కౌంటర్ ఫేక్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసుపై సిర్పూర్కర్‌ కమిటీ సంచలన నివేదికను ఇచ్చింది. టూవీలర్ ఆగిపోవడంతో హైవేపై నిలిచిపోయిన దిశను కొందరు యువకులు తీసుకెళ్లి రేప్‌ చేసి చంపేశారు. ఆ తర్వాత నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇది ఫేక్ ఎన్‌కౌంటర్‌ అంటూ ఆరోపణలు రావడంతో నిజానిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సిర్పూర్కర్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. ఎన్కౌంటర్‌పై విచారణ జరిపిన కమిషన్ ఇదో ఫేక్ ఎన్‌కౌంటర్ అని తేల్చింది. ఎన్‌కౌంటర్‌ బూటకం అని తేల్చేందుకు అవసరమైన ఆధారాలను, టెక్నికల్ ఎవిడెన్స్‌లను నివేదికలో పొందుపరిచింది.

ఆ నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది. నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిర్పూర్కర్ నివేదికను గోప్యంగా ఉంచాలని ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్‌ కోరగా … ఇందులో గోప్యత ఏముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దోషి ఎవరో తేలిపోయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నివేదిక పబ్లిక్ డొమైన్‌లోకి వస్తే న్యాయ వ్యవస్థపై ప్రభావం పడుతుందని శ్యామ్ దివాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

నివేదికను ఎందుకు బహిరంగపరచకూడదని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించారు. దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని సీజేఐ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. సిర్పూర్కర్‌ కమిషన్ నివేదిక సాప్ట్‌కాపీ రూపంలో కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నివేదికపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలంది. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఈ కేసుపై విచారణ జరపాల్సిందిగా హైకోర్టును ఆదేశించింది. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.