ఎఫ్4 కూడా వస్తోంది

ఎఫ్4 కూడా వస్తోంది

ఎఫ్-3 విడుదలకు ముందే మరో పెద్ద ప్రకటన చేశాడు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్4 కూడా తెరకెక్కిస్తామని ప్రకటించాడు. ఎఫ్3 ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఈ నిర్మాత.. ఎఫ్2 ఫ్రాంచైజీని కొనసాగించే ఉద్దేశంలో ఉన్నట్టు తెలిపాడు.

“ఎఫ్4 కూడా ప్లానింగ్ లో ఉంది. అనీల్ రావిపూడి మంచి ఐడియా చెప్పాడు. ఎఫ్3 తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటాం. ఎఫ్2 మా బ్యానర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ ఫ్రాంచైజీని వదులుకోవడం నాకే కాదు, ఏ నిర్మాతకు ఇష్టం ఉండదు. కాబట్టి కచ్చితంగా ఎఫ్4 వస్తుంది. కాకపోతే దానికి ఇంకా టైమ్ ఉంది.”

ఇలా ఎఫ్3 సీక్వెల్ పై స్పష్టమైన ప్రకటన చేశాడు దిల్ రాజు. ఎఫ్3 సినిమాను సాధారణ టికెట్ రేట్లకే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన ఈ నిర్మాత.. టికెట్ రేట్ల పెంపుపై ప్రజలు నన్ను తిట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నాడు. ఓ డిస్ట్రిబ్యూటర్ గా తను నిర్మాతకు నిజాయితీగా లెక్కలు సమర్పిస్తానని, బయటకు ఏ నంబర్ చెప్పాలనేది నిర్మాత ఇష్టమని అన్నాడు.

పూర్తిగా ఎఫ్3కే పరిమితమైన దిల్ రాజు.. ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ తో చేస్తున్న సినిమాపై స్పందించడానికి నిరాకరించాడు. ఆ సినిమా గురించి మాట్లాడితే అస్సలు టైమ్ చాలదని, ఎఫ్3 ప్రమోషన్ పక్కకెళ్లిపోతుందని చెప్పుకొచ్చాడు.