ప్రపంచ బాక్సింగ్ లో తెలుగు బాక్సర్ పంచ్ గోల్డ్ మెడల్ రౌండ్లో నిఖత్ జరీన్

ప్రపంచ బాక్సింగ్ లో తెలుగు బాక్సర్ పంచ్ గోల్డ్ మెడల్ రౌండ్లో నిఖత్ జరీన్

టర్కీలోని అంటాలియా వేదికగా జరుగుతున్న 2022 ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలలో తెలుగు రాష్ట్ర్రాల స్టార్ బాక్సర్, నిజామాబాద్ వండర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది.

52 కిలోల విభాగం గోల్డ్ మెడల్ రౌండ్ కు అర్హత సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన తెలుగు తొలి మహిళాబాక్సర్ గా చరిత్ర సృష్టించింది.

ప్రపంచ సీనియర్స్ ఫైనల్లో తొలిసారి…

టర్కీ ఆతిథ్యంలో జరుగుతున్న ఈ ప్రపంచ బాక్సింగ్ సమరంలో 73 దేశాలకు చెందిన 310 బాక్సర్లు వివిధ విభాగాలలో పోటీపడుతున్నారు. అయితే..తెలంగాణా రాష్ట్ర్రం లోని నిజామాబాద్ నుంచి భారత బాక్సింగ్ లోకి దూసుకొచ్చిన నిఖత్ జరీన్ సీనియర్ ప్రపంచకప్ లో పాల్గొన్న రెండోసారే 52 కిలోల ఫైనల్స్ కు అర్హత సాధించడం ద్వారా..ఇప్పటికే రజత పతకం ఖాయం చేసుకోగలిగింది.

ఫైనల్లో చోటు కోసం బ్రెజిల్ బాక్సర్ కారోలిన్ డీ అల్మడాతో జరిగిన పోరులో 25 సంవత్సరాల నిఖత్ అత్యుత్తమంగా రాణించింది, ఓ వ్యూహం ప్రకారం పోరాడి ప్రత్యర్థిపై సంచలన విజయం నమోదు చేసింది.
సెమీఫైనల్‌ బౌట్‌లో నిఖత్‌ జరీన్‌ 5-0 తేడాతో కరోలైన్‌ డీ అల్మెడా(బ్రెజిల్‌)ను మట్టికరిపించింది. ఆది నుంచి తనదైన దూకుడు ప్రదర్శించిన నిఖత్‌..బ్రెజిల్‌ బాక్సర్‌కు ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగింది.

తొలిరౌండ్ లో ఆచితూచి పోరాడిన నిఖత్ ఆ తర్వాత పుంజుకొని..పదునైన పంచ్‌లకు లెఫ్ట్ , రైట్‌ జాబ్స్‌, హుక్స్‌ ను జోడించి కారోలినాను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిర్ణయాత్మక ఆఖరి రౌండో లో నిఖత్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా..దూరంగా ఉంటూ .. వీలుచిక్కినప్పుడల్లా పంచ్‌లు విసరడం ద్వారా 5-0తో విజేతగా నిలిచింది.

ఇటీవలే ముగిసిన స్ట్రాంజా బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణ పతకంతో చెలరేగిన నిఖత్ కు జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన అనుభం ఉంది.2011లో టర్కీలోనే జరిగిన ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది.

స్వర్ణ పతకం కోసం జరిగే పోరులో థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ జుటామస్‌తో నిఖత్ అమీతుమీ తేల్చుకోనుంది.

మరో సెమీఫైనల్లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ కజకిస్థాన్‌కు చెందిన జైనా షెకర్‌బెకోవాను జిట్ పాంగ్ 4-1తో చిత్తుచేసింది. ఫైనల్లో నిఖత్ జరీన్ నుంచి జిట్ పాంగ్ కు గట్టిపోటీ ఎదురుకానుంది.

పర్వీన్, మనీషాలకు కాంస్యాలు..

ఇతర విభాగాలలో భారత బాక్సర్లకు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. మనీషా (57 కేజీలు), పర్వీన్‌ (63 కేజీలు) సెమీస్ లోనే ఓటమిపాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెమీఫైనల్స్‌లో మనీషా 0–5తో ఇర్మా టెస్టా (ఇటలీ) చేతిలో… పర్వీన్‌ 1–4తో అమీ సారా బ్రాడ్‌హర్ట్స్‌ (ఐర్లాండ్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.