సీఎం వద్దకు గన్నవరం గొడవ.. టికెట్‌పై క్లారిటీకి చాన్స్

సీఎం వద్దకు గన్నవరం గొడవ

పార్టీ పరంగా కార్యక్రమాలు వేగవంతం చేస్తున్న సీఎం జగన్‌ నియోజకవర్గాల్లో నేతల మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు. చాలాకాలంగా గన్నవరం వైసీపీలో వివాదం నడుస్తోంది. ఇక్కడ మూడు వర్గాలు తయారయ్యాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్ తో పాటు మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావులు కూడా వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు.

రానురాను వంశీ పట్టుబిగిస్తుండడంతో మిగిలిన ఇద్దరు నేతలు ప్రతిఘటన తీవ్రతరం చేశారు. కాంట్రాక్టులు, భూసేకరణ వంటి వ్యవహారాల్లో ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అసలు పక్క పార్టీ నుంచి వచ్చిన వంశీ పెత్తనం ఏంటి అని మిగిలిన ఇద్దరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాని వారిద్దరు కూడా ఒకటిగా లేరు. అటు వల్లభనేని వంశీ నుంచి.. దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్‌ రెడ్డిపై వైసీపీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఎమ్మెల్యే పనులకు శివభరత్‌ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.

ఇప్పటికీ ఒక స్పష్టత ఇవ్వకపోతే మూడు గ్రూపుల కారణంగా ఎన్నికల నాటికి ఇబ్బందులు వస్తాయని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఈనేపథ్యంలో నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు ఎవరికి? వచ్చే ఎన్నికల్లో టీకెట్ ఎవరికి అన్న దానిపై ఇప్పుడే ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందన్న భావనతో వైసీపీ ఉంది.

ఇందులో భాగంగా తాడేపల్లికి రావాల్సిందిగా నేతలకు ఫోన్లు వెళ్లాయి. స్వయంగా ముఖ్యమంత్రే నేతలతో విడివిడిగా చర్చించి వారికి హామీలు ఇవ్వనున్నారు. తొలుత గురువారం సాయంత్రం దుట్టా సీఎం జగన్‌ను కలవనున్నారు. ఆ తర్వాత మిగిలిన నేతలనూ ఆహ్వానించనున్నారు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకే టికెట్ ఇవ్వాలన్న ఆలోచనతో వైసీపీ నాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు. ఇందుకోసం దుట్టా, యార్లగడ్డ వెంకట్రావ్‌ను బుజ్జగించేందుకు పిలిచినట్టు చెబుతున్నారు.

ALSO READ: ఎత్తిపోయిన బాబుకు మద్దతుగా ఈనాడు ఎత్తిపోతలు