కొవ్వు తీసేసే శస్త్రచికిత్స తర్వాత నటి మృతి, ఆస్పత్రిపై ఫిర్యాదు చేసిన కుటుంబం

కన్నడ టెలివిజన్ నటి, యూట్యూబ్ వీడియో మేకర్ చేతన రాజ్ (22) కొవ్వును తొలగించే ప్లాస్టిక్ సర్జరీ కారణంగా అనారోగ్యం పాలై మరణించింది. ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించిన కేంద్రంపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. చేతనను ప్లాస్టిక్ సర్జరీ కోసం బెంగళూరు రాజాజీనగర్‌లోని శెట్టి కాస్మెటిక్ సెంటర్‌లో చేర్చారు, అయితే సర్జరీ తర్వాత ఆమెకు తీవ్ర ఆరోగ్య సమస్యలు రావడంతో, ఆమెను కాడే ఆసుపత్రికి తరలించారు. ఆమె ఊపిరితిత్తులలో నీరు నిండి ఊపిరి పీల్చుకోలేక పోవడంతో ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు.

చేతన తండ్రి గోవింద్ ఇమాట్లాడుతూ “నా కూతురు నన్ను కొవ్వును తొలగించే శస్త్రచికిత్స చేయించుకోవడానికి అనుమతి కోరింది. నేను అనుమతి ఇవ్వడానికి నిరాకరించాను. అలాంటి శస్త్రచికిత్స అవసరం లేదని ఆమెకు చెప్పాను. కానీ ఆమె నా మాట వినకుండా శస్త్రచికిత్స చేయించుకుంది. తన‌ నిర్లక్ష్యం కారణంగా మరణించింది. “తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి అనుమతి తీసుకోకుండా ఆ ఆస్పత్రి శస్త్రచికిత్సను ఎలా నిర్వహించింది?” అని అడిగాడు గోవింద్.

మరో వైపు శెట్టి కాస్మెటిక్ సెంటర్ వైద్యులు తమ సిబ్బందిని బెదిరించారని ఆరోపిస్తూ కాడే ఆసుపత్రి యాజమాన్యం బసవేశ్వరనగర్ పోలీసులకు పిర్యాదు చేశారు.

తమ పిర్యాదులో కాడే ఆసుపత్రి అధికారులు.. “సోమవారం సాయంత్రం 5.30 గంటలకు, మెల్విన్ అనే మత్తుమందు వైద్యుడు, ఆసుపత్రిలోని అన్ని ప్రోటోకాల్‌లను విస్మరించి రోగిని తీసుకొని కాడే ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. అతన్ని ఆపినందుకు అక్కడున్న భద్రతా సిబ్బందిని బెదిరించాడు. రోగిని నేరుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లోపలికి తీసుకువెళ్లి రోగికి చికిత్స చేయమని వైద్యులను కోరాడు. అప్పటికే ఆమె గుండె ఆగిపోయిందని వైద్యులు చెప్పారు. అంతే కాక‌ చేతన రాజ్ 06:45 గంటలకు చనిపోయిందని ప్రకటించేలా డాక్టర్ మెల్విన్ తమను బలవంత చేశారని కాడే ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

చేతన మృతదేహానికి ఎంఎస్‌ రామయ్య ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.

చేతన మరణంపై బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ మాట్లాడుతూ, “వైద్యపరంగా కొవ్వు రహిత శస్త్రచికిత్స అని పిలవబడే పదం లేదు. అయితే, దీనిని లైపోసక్షన్ అని పిలుస్తారు, ఇది శరీరంలోని కొవ్వును తొలగించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ శస్త్రచికిత్స. వర్కవుట్ చేసినప్పటికీ శరీరంలోని కొన్ని భాగాల్లోని కొవ్వును తొలగించలేని వ్యక్తులకు ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఈ శస్త్రచికిత్స బరువు తగ్గించడానికి ఉద్దేశించినది కాదు కానీ శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడానికి సహాయపడుతుంది. సైడ్-ఎఫెక్ట్స్ వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి, తొలగించబడిన కొవ్వు పరిమాణం మరియు రోగుల వైద్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

“రోగి యొక్క వైద్య చరిత్రను అర్థం చేసుకున్న తర్వాత శస్త్రచికిత్సను అత్యంత భద్రతతో నిర్వహించాలి” అని కూడా అతను చెప్పాడు.