ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ పురోగమిస్తున్న ‘దళిత బంధు’

కొన్ని ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు వివిధ జిల్లాల్లో క్రమంగా పురోగమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ఈ పథకం వేగంగా పుంజుకుంటోంది.

పథకం ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 38,617 మంది లబ్ధిదారులను గుర్తించామని, వీరిలో 37,821 మంది వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందాలు ధృవీకరించి, లబ్ధిదారుల ఖాతాలను తెరిపించడంలో 97.94 శాతం విజయం సాధించామని అధికారులు తెలిపారు. మే 13 వరకు 36,130 మంది లబ్ధిదారులకు మంజూరు లేఖలు అందజేయగా, 34,405 మంది ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 12,921, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గుర్తించిన నాలుగు మండలాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 19,495 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి.

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 20 వేలకు పైగా దళిత కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేసినా.. అర్హులైన కుటుంబాలు 18,211 ఉన్నట్లు క్షేత్ర పరిశీలనలో తేలింది. లబ్ధిదారుల గుర్తింపు, మంజూరు పత్రాలు జారీ చేయడం, గుర్తించిన లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయడం వంటి అంశాల్లో పథకం సంతృప్తికరంగా అమలు జరిగింది. మే 13 వరకు నియోజకవర్గంలో 9,747 యూనిట్లు గ్రౌండింగ్ చేసినట్లు నివేదించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసలమర్రి మండలంలో దాదాపు 72 మంది లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయడంతో ఈ పథకం అమలు దాదాపు పూర్తి కావచ్చింది. మండలంలో దళిత బందు కింద 71 యూనిట్లు గ్రౌండింగ్ జరిగాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 3,427 మంది లబ్ధిదారులను గుర్తించగా, 1,989 మంది ఖాతాలకు డబ్బులు జమ అయ్యాయి. మండలంలో ఇప్పటివరకు 632 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా చారుగొండ మండలంలో 90 శాతానికి పైగా దళిత బంధు అమలయ్యింది. 1,396 మంది లబ్ధిదారులను గుర్తించి, వారి ఖాతాలకు నిధులు విడుదలైన తర్వాత 1,373 యూనిట్లు గ్రౌండింగ్ జరిగాయి.

దళిత బంధు అమలులో నిజామాబాద్ జిల్లా 549 యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా, 495 యూనిట్లు గ్రౌండింగ్ అయిన సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. 444 యూనిట్లతో సంగారెడ్డి, 423 యూనిట్లతో రంగారెడ్డి , 301 యూనిట్లతో నాగర్‌కర్నూల్ , 291 యూనిట్లతో మహబూబ్‌నగర్ ,290 యూనిట్లతో వికారాబాద్ జిల్లాలో పథకం అమలు వేగంగా, షెడ్యూల్ ప్రకారం సాగుతోంది.

అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన తర్వాత కూడా ఒక్క‌ యూనిట్‌ను మాత్రమే గ్రౌండింగ్‌ చేయగలిగారు. 17 యూనిట్లతో నారాయణపేట, 52 యూనిట్లతో జయశంకర్ భూపాలపల్లి , 61 యూనిట్లతో రాజన్న సిరిసిల్ల,65 యూనిట్లతో ములుగు కూడా పథకం అమలులో దిగువన ఉన్నాయి.