వాలంటీర్‌ను కొట్టిన మాజీ మంత్రి

మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ వాలంటీర్‌ను కొట్టారు. ఇప్పటికే సొంత పార్టీ శ్రేణులే వేధిస్తుంటారన్న విమర్శలు ఉన్న శంకర్‌ నారాయణ.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సహనం కోల్పోయారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో ఆయన పర్యటించారు. ప్రభుత్వం ఇచ్చిన స్టిక్కర్లను ఇంటింటికి అతికించలేదని మాజీ మంత్రి ఆగ్రహించారు.

అక్కడే ఉన్న వాలంటీర్‌ రామచంద్రారెడ్డిపై చేయి చేసుకున్నారు. వాలంటీర్‌ను మాజీ మంత్రి కొట్టడం చూసి గ్రామస్తులు, నేతలు కంగుతిన్నారు. తనను కొడుతున్న మాజీ మంత్రిపై వాలంటీర్ తిరగబడ్డారు. ఎందుకు కొడుతున్నారంటూ ప్రశ్నించారు. ఇంతలో వాలంటీర్‌ సోదరుడు, అతడి స్నేహితులు, గ్రామంలో యువకులు పోగయ్యారు.

తమ గ్రామానికి వచ్చిన తమ వాలంటీర్‌ను ఎందుకు కొట్టారంటూ శంకర్‌నారాయణను నిలదీశారు. అందరూ చుట్టుముట్టడంతో శంకర్‌నారాయణ అవాక్కయ్యారు. వివాదం పెద్దది అయ్యే అవకాశం ఉందని గమనించిన పోలీసులు, గ్రామ వైసీపీ నేతలు కలిసి వాలంటీర్‌ను, యువకులను పక్కకు తీసుకెళ్లి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి శంకర్‌ నారాయణ అనంతరం గ్రామం నుంచి వెళ్లిపోయారు.