ఏపీలో బస్సు యాత్ర, రూట్ మ్యాప్ ఖరారు

ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా అప్పుడే పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు టీడీపీ బాదుడే బాదుడుతో ముందుకెళ్తోంది. వైసీపీ ఇంటింటికి మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పుడు మంత్రులు బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈనెల 26 నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో మంత్రులు బస్సు యాత్ర చేయనున్నారు. అయితే ఈ బస్సు యాత్రలో ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ మంత్రులతో నిర్వహించనున్నారు. వారితో పాటు పార్టీ ముఖ్యనేతలు కూడా యాత్రలో పాల్గొంటారు.

బస్సు యాత్ర జరిగే సమయంలోనే టీడీపీ మహానాడు కూడా ఉంటోంది. మంత్రులు బస్సు యాత్ర షెడ్యూల్‌, రూట్ మ్యాప్‌పై పలువురు మంత్రులు సీఎం జగన్‌తో చర్చించారు. ఆయన అంగీకరించారు. సామాజిక న్యాయం పేరుతో ఈ బస్సు యాత్ర జరుగుతుంది. బీసీఎస్సీఎస్టీమైనార్టీ ఓటర్లను ఆకర్శిస్తే ఎన్నికల్లో తిరుగుండదన్న భావనతో … ఆయా వర్గాల మంత్రులతో ఈ బస్సు యాత్రకు సిద్ధమైంది వైసీపీ.

ఈనెల 26న శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. 26న శ్రీకాకుళం లేదా విజయనగరంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆరోజు రాత్రికి విశాఖలో బస చేస్తారు. 27న రాజమండ్రిలో బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి తాడేపల్లిగూడెంలో బస చేస్తారు మంత్రులు. 28న నరసరావుపేటలో బహిరంగ సభ ఉంటుంది. ఆరోజు రాత్రికి నంద్యాలలో మంత్రులు బస ఉంటుంది. 29న అనంతపురంలో బహిరంగ సభలో యాత్ర ముగుస్తుంది. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్‌ సిద్దం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మంత్రులు బృందానికి స్థానికంగా స్వాగతం పలుకుతారు.