ఎత్తిపోయిన బాబుకు మద్దతుగా ఈనాడు ఎత్తిపోతలు

ఎత్తిపోయిన బాబుకు మద్దతుగా ఈనాడు ఎత్తిపోతలు

ఎత్తిపోతున్నాయి అంటూ రాష్ట్రంలోని వివిధ ఎత్తిపోతల పథకాల గురించి ఈనాడులో వచ్చిన కథనంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఎత్తిపోయిన బాబుకి మద్దతుగా ఈనాడు ఎత్తిపోతలు మొదలు పెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లి ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్టుగా, రామోజీరావు, ఎల్లో మీడియా ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకడని అన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ సీజన్ ని కాస్త ముందుగానే ప్రారంభించేందుకు నిర్ణయించిందని, జూన్ లోనే నీళ్లు ఇస్తుంటే రామోజీకి అది కనిపించదని అన్నారు.

డోనేకల్లు లిఫ్ట్ పథకం 1989లో ప్రారంభించారని, అదే ఏడాది అది మూతపడిందని, దానికి కూడా జగన్ ప్రభుత్వం కారణం అన్నట్టుగా ఈనాడులో కథనాలు వండివార్చారని మండిపడ్డారు అంబటి. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా అఘోరించిన మీ పెద్ద మనిషి చంద్రబాబు హయాంలో ఎప్పుడూ ఇలాంటి కథనాలు రాయలేదేంటని ప్రశ్నించారు. వైసీపీపై విషం చిమ్మినా 2019లో చంద్రబాబు గతి ఏమైందో చూశామని, 2024లో కూడా అదే జరుగుతుందని చెప్పారు. చంద్రబాబు హయాంలో, అంతకు ముందు మూతపడినవాటికి కూడా జగన్ కారణం అవుతారా అని ప్రశ్నించారు. ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉందన్న వార్త పూర్తిగా అవాస్తవం అని అన్నారు . ఎల్లో మీడియా అబద్ధాలు రాసినంత మాత్రాన.. ప్రజలు వాటిని నమ్మరని, జగన్ కి దూరం కారని చెప్పారు. ఎవర్నో అధికారంలోకి తీసుకురావడానికి అబద్ధాలు ప్రచురిస్తున్న ఎల్లో మీడియానే క్రమంగా ప్రజలకు దూరమవుతోందని అన్నారు.

ముందస్తు ముహూర్తం లేదు..
ఎన్నికలొస్తున్నాయని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని, అలాంటి ముందస్తు ఆలోచనలేవీ ప్రభుత్వానికి లేవని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు అంబటి రాంబాబు. చంద్రబాబు, దేవినేని ఉమాల అజ్ఞానం, తొందరపాటు చర్యల వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, అందుకే ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమవుతోందని వివరించారు. రెండు, మూడు నెలల్లో డయాఫ్రం వాల్ సమస్యకు పరిష్కారం కనుగొంటామని అన్నారు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు అంబటి. జగన్ పరిపాలనలో ప్రతి గడపలో ఆనందం.. ప్రతి ఒక్కరిలో సంతోషం కనిపిస్తున్నాయని అన్నారు.