అందుకే స్పీడ్ తగ్గించాను – అలీ

అలీ

ఒకప్పుడు ప్రతి సినిమాలో కనిపించేవారు అలీ. హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఈ నటుడు, ఈమధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఆయన మార్క్ కామెడీ సిల్వర్ స్క్రీన్ పై తగ్గిపోయింది. ఈ విషయాన్ని అలీ కూడా అంగీకరించారు. తను కావాలనే చాలా సినిమా ఆఫర్లను తిరస్కరిస్తున్నానని ఓపెన్ గా ప్రకటించారు.

“బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీల సీరియల్‌ చేశా. ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే ఆ సీరియల్‌ చేశా. ఎందుకంటే ఆయన నన్ను హీరో చేశాడు. స్టార్‌ దర్శకుడిగా ఉన్న ఆయన..అందరిని ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనక ముందు ఆలోచించకుండా చేసేస్తా. ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో మాకు క్యారెక్టర్‌ ఇస్తున్నారు. సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే..అలీగారు ఎందుకు ఈ సినిమాలో నటించాడు? అని అందరు అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడం లేదు. కథ విని నా క్యారెక్టర్‌ బాగుంటేనే సినిమా చేస్తున్నాను. కొత్త వాళ్లకు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు.”

ఎఫ్3 ప్రచారంలో భాగంగా మీడియా ముందుకొచ్చిన అలీ, ఈ విషయాన్ని వెల్లడించారు. ఎఫ్3 సినిమాలో మంచి పాత్ర చేశానని చెప్పుకొచ్చిన అలీ.. ఇలా వచ్చి అలా వెళ్లే క్యారెక్టర్ కాకుండా, సినిమాలో 40 నిమిషాల పాటు తన పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.

ALSO READ: నేను బ్రాండ్ తో రాలేదు.. బ్రాండ్ ఇండియాతో వచ్చాను