ఐపీఎల్ లో సిక్సర్ల వెల్లువ! 65 మ్యాచ్ ల్లోనే 915 సిక్సర్లు

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటేనే సిక్సర్ల హోరు..పరుగుల జోరు. 20 ఓవర్లలో అందిన బంతిని అందినట్లు బాదడం, సిక్సర్ల మోత మోగించడం…బాదుడే బాదుడు బ్యాటింగ్ తో అభిమానులను కిర్రెక్కించడమే ఐపీఎల్.

2008 సీజన్లో ప్రారంభమైన ఐపీఎల్ గత 15 సంవత్సరాలుగా అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోతూ టీ-20 క్రికెట్ ప్రమాణాలలో కొత్తపుంతలు తొక్కుతోంది.
వివిధజట్లకు చెందిన బ్యాటర్లు వినూత్నమైన షాట్లతో, బౌండ్రీలు, సిక్సర్ల బాదుడులో రికార్డుల మోత మోగిస్తున్నారు.

సిక్సర్ల బాదుడులో సరికొత్త రికార్డు

గత 14 సీజన్ల ఐపీఎల్ కేవలం 8జట్లకు మాత్రమే పరిమితం కాగా. ప్రస్తుత సీజన్లో మాత్రం జట్ల సంఖ్య 8 నుంచి 10కి, లీగ్ మ్యాచ్ ల సంఖ్య 60 నుంచి 70 పెరగడంతో. సిక్సర్ల సంఖ్య సైతం అదేస్థాయిలో పెరిగిపోయింది.

ప్రస్తుత 15వ సీజన్ మొదటి 65 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికే సిక్సర్ల బాదుడులో ఓ అపూర్వ రికార్డును నమోదయ్యింది. మొత్తం 70 మ్యాచ్ ల లీగ్ రౌండ్ లో భాగంగా ముంబై ఇండియన్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య ముగిసిన 65వ మ్యాచ్ వరకూ 915 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది గతంలో ఎన్నడూలేని రికార్డుగా మిగిలింది.

ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో ఇన్ని సిక్సర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతంలో 2018 సీజన్లో మాత్రమే అత్యధికంగా 872 సిక్సర్లు నమోదయ్యాయి. ఇదే అత్యధిక సిక్సర్ల ఐపీఎల్ గా ఉంటూ వచ్చింది. అయితే.. ప్రస్తుత సీజన్‌ మొదటి 65 మ్యాచ్ ల్లోనే 915 సిక్సర్లతో ఆ రికార్డు తెరమరుగయ్యింది.

బిగ్ హిట్టర్ల బ్యాంగ్ బ్యాంగ్!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ ఆటగాడు టిమ్ డేవిడ్, చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీ, ఆల్ రౌండర్ శివమ్ దూబే, గుజరాత్ మిడిలార్డర్ హిట్టర్ రాహుల్ తెవాటియా, బెంగళూరు హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్, కోల్ కతా డైనమైట్ యాండ్రీ రసెల్, కింగ్స్ పంజాబ్ సూపర్ హిట్టర్ లైమ్ లివింగ్ స్టోన్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్ లాంటి బిగ్ హిట్టర్లు తమదైన శైలిలో షాట్లు కొడుడూ వారేవ్వా అనిపిస్తున్నారు. బంతి ఉన్నది బాదడానికే అన్నట్లుగా. అలవోకగా భారీసిక్సర్లు బాదేస్తూ..బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.

లీగ్ దశ ఆఖరి ఐదురౌండ్ల మ్యాచ్ ల్లో మొత్తం పదిజట్ల బ్యాటర్లు మరో 85 సిక్సర్లు బాదినా…లేక…ప్లే ఆఫ్ రౌండ్ మూడుమ్యాచ్ లతో కలిపి చూసినా. 1000 సిక్సర్ల రికార్డును చేరుకోడం ఏమంతకష్టం కాబోదని అనిపిస్తోంది.

ఇదీ సిక్సర్ల రికార్డు

ఐపీఎల్ 15వ సీజన్లో అత్యధికంగా 915 సిక్సర్లు. అత్యల్పంగా 2009 సీజన్లో 506 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. ఇక ప్రస్తుత సీజన్లో సుదూర సిక్సర్ల రికార్డుల్లో.

పంజాబ్ కింగ్స్ హిట్టర్ లైమ్ లివింగ్ స్టోన్ అందరికంటే ముందున్నాడు.

లైమ్ కొట్టిన ఓసిక్సర్ 117 మీటర్ల దూరం వెళ్లి పడింది. ఇదే ఇప్పటి వరకూ లాంగెస్ట్ సిక్సర్ గా నమోదయ్యింది.

ముంబై ఇండియన్స్ యువహిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ 112 మీటర్లు, నికోలస్ పూరన్ 108 మీటర్లు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 107 మీటర్ల దూరం సిక్సర్లు ఆ తరువాతి స్థానంలో నిలిచాయి.
లీగ్ దశలోని మిగిలిన 5 మ్యాచ్ లు, ప్లేఆఫ్ రౌండ్, ఫైనల్ రౌండ్ మ్యాచ్ ల వరకూ మరెన్ని సిక్సర్లు నమోదు కాగలవన్నదే ఇక్కడి అసలు పాయింట్.

ALSO READ: ఐపీఎల్ లో హైదరాబాద్ బుల్లెట్లు! భువీ, ఉమ్రాన్ ఇద్దరూ ఇద్దరే