దసరా నుంచి ఆదిపురుష్ ప్రమోషన్

ప్రభాస్ నుంచి రాధేశ్యామ్ వచ్చేసింది. మరి నెక్ట్స్ రాబోయే సినిమా ఏంటి? అది ఏ సినిమా అనేది అందరికీ తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ఆదిపురుష్ సినిమా లిస్ట్ లో నెక్ట్స్ రిలీజ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

ఇప్పుడీ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ప్లాన్ రెడీ చేశారు. ఈ ఏడాది దసరా రోజు నుంచి ఆదిపురుష్ ప్రచారం ప్రారంభించాలని యూనిట్ నిర్ణయించింది. దసరా రోజున ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, అక్కడ్నుంచి వరుసగా 3 నెలల పాటు సినిమాకు ప్రచారం కల్పించాలని యూనిట్ అనుకుంటోంది. ఏ అప్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే అంశంపై దాదాపు చార్ట్ రెడీ అయింది.

టీ-సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ లో శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. సినిమాలో అతడ్ని అంతా రాఘరామ్ అని సంభోదిస్తారు. ఇక ఈ సినిమాలో విలన్ గా, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, సీత పాత్రలో కృతి సనన్ నటించిన సంగతి తెలిసిందే.

ముంబయిలో వేసిన భారీ సెట్ లో పూర్తిగా బ్లూమ్యాట్ లో తీసిన ఈ సినిమాకు సంబంధించి భారీ గ్రాఫిక్ వర్క్ నడుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి గ్రాఫిక్ వర్క్ ముగుస్తుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తన కెరీర్ లో ప్రభాస్ నటిస్తున్న మొట్టమొదటి మైథలాజికల్ మూవీ ఇదే. భక్తకన్నప్ప సినిమా చేయాలనుకున్నాడు. అది కార్యరూపం దాల్చలేదు. ఆదిపురుష్ తో అలా సెట్ అయింది.

ALSO READ: ఫస్ట్ టైమ్ స్టేజ్ పై స్టెప్పులేసిన మహేష్