అడ్డ‌దారిలో అప్పుల‌పై.. ఏపీకి కాగ్ లేఖ‌

కొత్త అప్పులు చేసుకునేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఏపీ అప్పులపై కేంద్ర ప్రభుత్వం, కాగ్ నిశితంగా పరిశీలన చేస్తున్నాయి. రుణపరిమితి తగ్గుతుందన్న భయంలో వాస్తవ అప్పులను రాష్ట్రం దాస్తోందన్న అభిప్రాయంతో కాగ్ ఉంది. వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెస్తూ వాటిని ప్రభుత్వ పథకాలకు వాడుకుంటున్నారని.. దాని వల్ల కార్పొరేషన్లు కేవలం అప్పులు తెచ్చే యంత్రాలుగా మారడం, తిరిగి అప్పులు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ల ద్వారా, ఇతర ఏ రూపంలో అప్పులు తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే లెక్కిస్తామని ఇది వరకే సీఏజీ స్పష్టం చేసింది. మారిన విధానంలో అప్పు లెక్కింపు కోసం.. అన్ని వివరాలు పంపాలని అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ ప్రభుత్వానికి ఇది వరకే కాగ్ ఆదేశించింది.

దాదాపు అన్ని రాష్ట్రాల అప్పులు, ఆదాయాలు, ఇతర లెక్కలను కాగ్ తేచ్చింది. ఏపీ మాత్రం సరైన వివరాలు పంపకపోవడంతో ఏపీ లెక్కలను ఇంకా తేల్చలేదు. ఏప్రిల్ ఆఖరి నాటికే ఈ లెక్కలను కాగ్ తేల్చాల్సి ఉన్నా అది జరగలేదు. తాజాగా ఈసారి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్- పీఏజీ కార్యాలయం నుంచే ఏపీ ఆర్థిక శాఖ అధికారులకు లేఖ వచ్చింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలకు, కార్పొరేషన్లకు, ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణాల వివరాలన్నింటిని తక్షణం సమర్పించాలని స్పష్టం చేసింది. మే 31కి అందుకు గడువుగా విధించింది. తమ లేఖలోని అంశాలను అత్యవసరంగా భావించాలని కోరింది.

అయితే కాగ్ కోరినట్టుగా ప్రభుత్వ రంగ సంస్థలకు, కార్పొరేషన్లకు, ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణాల వివరాలన్నింటినీ పంపితే ఏపీ అప్పు భారీగా ఉందని అధికారికంగా నిర్ధారించినట్టు అవుతుంది. అదే జరిగితే ఇకపై కొత్తగా భారీగా అప్పులు చేసేందుకు అవకాశం లేకుండాపోతుంది. రుణపరిమితిపై భారీగా కోతపడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏపీ ప్రభుత్వం నగదు బదిలీ పథకాలను, జీతాలను, ప్రభుత్వ నిర్వాహణను సజావుగా చేయడం పెను సవాల్‌ అవుతుంది.