ది వారియర్ టీజర్ రివ్యూ

మరో యాక్షన్ మూవీతో రెడీ అయిపోయాడు హీరో రామ్ పోతినేని. పక్కా పోలీస్ గెటప్ లో రామ్ నటించిన సినిమా ‘ది వారియర్’. ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అంటే ఏదో హీరో గురించి పరిచయం చేసి విడిచిపెట్టలేదు. హీరో, హీరోయిన్, విలన్, హీరో తల్లి.. ఇలా అందర్నీ పరిచయం చేశారు.

‘ది వారియర్’ టీజర్‌లో హీరో రామ్ క్యారెక్టర్‌తో పాటు విలన్ రోల్ చేస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతి శెట్టి, నదియా క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అని చెప్పాలి. హీరోను లింగుస్వామి బాగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండ‌ర్డ్స్‌లో ఉన్నాయి.

‘ఈ పోలీసోళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాం అప్ప! ఇంతకు ముందు సైలెంట్‌గా ఉండేటోళ్ళు. ఇప్పుడు వయొలెంట్ గా లోపలేస్తాండారు. ఈ మధ్య సత్య అని ఒకడు వ‌చ్చున్నాడు… వాడియమ్మా! ఒక్కొక్కడికి పెడుతున్నాడు. కానీ, ఒకటప్పా… కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు. అట్టా కొడతాడు… టాబ్లెట్ ఇస్తాడు’ అని నటుడు రిడిన్ కింగ్‌స్లే చెబుతుంటే… స్క్రీన్ మీద పవర్‌ఫుల్‌గా రామ్ ఎంట్రీ ఇచ్చారు. టీజర్‌లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.

యాక్షన్ మాత్రమే కాదు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు టీజర్‌లో చోటు ఇచ్చారు. ‘డిప్యూటీ సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్ సత్య పోరీని నేను’ అని కృతి శెట్టి చెప్పడమే కాదు, రామ్‌తో రొమాన్స్ చేయడమూ చూపించారు. ‘ఆట బానే ఉంది, ఆడేద్దాం’ అంటూ ఆది పినిశెట్టి చెప్పడం, ఆయన గెటప్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి.

‘ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చినవాళ్ళను కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం’ అని హీరో రామ్‌తో నదియా ఒక మాట చెబుతారు. అందులో ఎమోషన్, ఫైర్… రెండూ ఉన్నాయి. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో హీరో ఏం చేశాడు? ఎవరిని వెతుక్కుంటూ వెళ్లి కొట్టాడు? అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.