పదవికి త్రిపుర సీఎం రాజీనామా

చాలా రోజులుగా ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన రాజ్‌భవన్ లో గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేశారు. ముఖ్యమంత్రి అయ్యాక బిప్లబ్ పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఇదిలా ఉంటే బిప్లబ్ కు సొంత పార్టీనుంచి కూడా వ్యతిరేకత ఎదురైనట్టు సమాచారం. మరోవైపు ప్రజల్లోనూ ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు బీజేపీ అధిష్ఠానం దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే బిప్లబ్ రాజీనామా చేసినట్టు సమాచారం.

ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. దీంతో అధిష్ఠానం సీరియస్‌గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు సొంతపార్టీ నుంచి కూడా ఆయనకు అసమ్మతి సెగ తగిలినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో నాయకత్వం మార్పు చేయాలని హైకమాండ్ భావించినట్టు సమాచారం. ఇటీవల బిప్లబ్ కుమార్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. రాజీనామా చేయాలని ఆదేశించిట్టు తెలుస్తోంది. దీంతో బప్లబ్ పదవిని వదులుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మకు రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కొత్త సీఎంను ఎంపిక చేసేందుకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేను కేంద్ర పరిశీలకులుగా రాష్ట్రానికి పంపనున్నారు.