గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం గోధుమల మార్కెట్ పై పడింది. ఆ రెండు దేశాలనుంచి గోధుమల ఎగుమతులు లేకపోవడంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిన్నది. దీంతో చాలా దేశాల్లో గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఆటోమేటిక్ గా రేటు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో.. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతులతో దేశ అవసరాలకు ఇబ్బంది ఏర్పడింది, దీంతో ఇక్కడ కూడా గోధుమలకు రేటు పెరిగింది. గోధుమపిండి నిత్యావసరంగా ఉన్న భారత్ లో గత నాలుగు నెలల కాలంలో రేటు 40శాతం పెరిగింది. పరిస్థితి మరింత ముదరకముందే గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.

దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మే 14 నుంచి గోధుమల ఎగుమతులను తక్షణమే నిలపివేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వుల కన్నా ముందుగా ఎగుమతుల కోసం అనుమతి తీసుకుని ఉంటే.. వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆహర భద్రత అవసరాలను తీర్చేందుకు ఇతర దేశాలకు భారత ప్రభుత్వం మంజూరు చేసిన గోధుమల ఎగుమతులకు కూడా అనుమతి ఉంటుంది.

గోధుమలతోపాటు ఉల్లి విత్తనాల ఎగుమతి విధానాన్ని కూడా రిస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి తీసుకువచ్చింది DGFT. ఇరాన్ తో పాటు మధ్య ఆసియా దేశాల్లో కూడా గోధుమల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇరాన్ లో దాదాపు 300 శాతం గోధుమల ధరలు పెరిగాయి. భారత్ లో ఆ పరిస్థితి రాకముందే కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. దేశీయంగా రేటు తగ్గి, గోధుమల లభ్యత పెరిగిన తర్వాతే ఎగుమతులపై ఆలోచిస్తామని చెప్పింది కేంద్రం.