హోం వర్క్ చేయకుండా సెట్స్ పైకి…!

ఎఫ్3 ప్రమోషన్లు మొదలైపోయాయి. సునీల్, సోనాల్ చౌహాన్ లాంటి తారలు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా సోనాల్ చౌహన్, తన అనుభవాల్ని చెప్పుకొచ్చింది. ఎఫ్3 సినిమాలో ఎలా అవకాశం వచ్చింది, తన పాత్ర తీరుతెన్నులు, తన కెరీర్ కు ఎఫ్3 ఏ మేరకు ఉపయోగపడుతుంది లాంటి అంశాల్ని చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు సోనాల్ మాటల్లోనే బ్యాక్ టు బ్యాక్ చూద్దాం.

– ”ఎఫ్ 3” ప్రాజెక్ట్ లోకి రావడం వెనుక చాలా ఆసక్తికరమైన కథ వుంది. ”లెజెండ్” సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పరిచయం. రామోజీ ఫిల్మ్ సిటీలో లెజెండ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ గారు వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మాట్లాడుకున్నాం. కలసి వర్క్ చేయాలని అనుకున్నాం. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఆయన నుండి ఫోన్ వచ్చింది. ‘ఎఫ్3 అనే సినిమా చేస్తున్నాను. ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను” అన్నారు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. అనిల్ గారు కామెడీ కింగ్. అప్పటికే ఎఫ్ 2 సినిమా చూశాను. హిలేరియస్ మూవీ అది. ఎఫ్2కి మించిన ఫన్ ఎఫ్3లో వుంటుంది.

– ఎఫ్3లో నేను చేస్తున్న పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. ట్రైలర్ లో కూడా సీక్రెట్ గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదం అందుతుంది. ఇప్పటికైతే నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.

– కామెడీ ఎంటర్ టైనర్ చేయడం నాకు కొత్త. చాలా టెన్షన్ పడ్డాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏవైనా సినిమాలు చూడాలా? అని దర్శకుడు అనిల్ రావిపూడిని అడిగాను. ఆయన సూపర్ కూల్. ఏమీ అలోచించకుండా నేరుగా షూటింగ్ కి వచ్చేయమని చెప్పారు. అనిల్ తో వర్క్ చేయడం ఆర్టిస్ట్ కి చాలా ఈజీ. ఆయనే నటించి చూపిస్తారు. ఆయనకి చాలా క్లారిటీ వుంటుంది. ఆర్టిస్ట్ నుండి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం ఆయనకు తెలుసు. ఆయన చెప్పినట్లే చేస్తే చాలు మన పని తేలికైపోతుంది.