ఫోకస్ మార్చిన ప్రభాస్

హీరో ప్రభాస్ ఫోకస్ మార్చాడు. మొన్నటివరకు సలార్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ హీరో, ఇప్పుడు ప్రాజెక్ట్-కె పై ఎక్కువ దృష్టి పెట్టాడు. సలార్ ను కొన్నాళ్లు పక్కనపెట్టాడు. తాజాగా మారిన ప్లాన్ ప్రకారం.. ఈ నెలంతా ప్రాజెక్ట్-కే షూటింగ్ లోనే ఉంటాడు ప్రభాస్. ఆ తర్వాత సలార్ సినిమా సెట్స్ పైకి వెళ్తాడు.

సలార్ పై ఎక్కువ రోజులు ఉండడం లేదు ప్రభాస్. వారం రోజులు మాత్రమే దానికి టైమ్ ఇచ్చాడు. ఆ వెంటనే తిరిగి ప్రాజెక్ట్-కె సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు. అలా వీలైనన్ని ఎక్కువ కాల్షీట్లు ప్రాజెక్ట్-కె సినిమాకే ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అశ్వనీదత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది.

ఈ సినిమాకు ప్రభాస్ ఎక్కువ కాల్షీట్లు ఇవ్వడానికి ఓ కారణం ఉంది. ఇందులో హీరోయిన్ గా దీపిక పదుకోన్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. వీళ్లిద్దరి కాల్షీట్లు సెట్ అవ్వడం ఇబ్బందిగా ఉంది. అందుకే వీళ్ల కోసం తన షెడ్యూల్స్ అన్నీ మార్చుకున్నాడు ప్రభాస్.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది. ఆ తర్వాత సలార్ విడుదలవుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల మారుతితో ప్రభాస్ చేయాల్సిన సినిమా మరింత ఆలస్యం అవుతోంది.