ఉత్తర కొరియాను చుట్టేస్తున్న కరోనా.. ఇప్పటికైనా వ్యాక్సిన్ కి ఓకే చెబుతారా..?

ప్రపంచ వ్యాప్తంగా ఫలానా దేశంలో కరోనా పరిస్థితి ఇలా ఉంది, టీకాలు వేసుకున్న జనాభా ఇంత అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వద్ద పక్కాగా లెక్కలున్నాయి. కానీ ఉత్తర కొరియా విషయంలో మాత్రం ప్రపంచ దేశాలకు ఎలాంటి సమాచారం లేదు. దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఇన్నాళ్లూ బాహ్య ప్రపంచానికి కొరియా విషయాలేవీ తెలియకుండా మేనేజ్ చేయగలిగారు. అసలు ఆ దేశంలో కరోనా ప్రవేశించలేదని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ఇటీవల అక్కడ కరోనా తొలికేసు నమోదైనట్టు ఉత్తర కొరియా అధికారిక ప్రకటన విడుదల చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి.

ఇదే తొలికేసు అంటున్నారే కానీ.. ప్రభుత్వం చెప్పిన గణాంకాలు చూస్తుంటే.. ఉత్తర కొరియాని ఆల్రడీ కరోనా చుట్టుముట్టేసినట్టు అర్థమవుతోంది. ఉత్తర కొరియా జనాభా రెండున్నర కోట్లు. అందులో మూడున్నర లక్షలమంది కరోనాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే దేశ జనాభాలో నాలుగో వంతు మందికి కరోనా వచ్చినట్టు అనధికారిక సమాచారం. కరోనా కేసు నమోదైన తొలిరోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కానీ కిమ్ ఎక్కడా టెన్షన్ పడినట్టు కనిపించడంలేదు. ప్రశాంతంగా లాక్ డౌన్ విధించి సైలెంట్ గా ఉన్నారు.

వ్యాక్సిన్లు వేసుకోరా..?
ఇప్పటి వరకూ ఉత్తర కొరియా కొవిడ్ వ్యాక్సిన్లకు దూరంగా ఉంది. ఆఫ్రికా దేశాలు వ్యాక్సిన్లు కొనే సామర్థ్యం లేక అల్లాడుతుంటే.. కొరియా మాత్రం ఆ స్థోమత ఉన్నా కూడా ససేమిరా అంటోంది. ఇరుగు పొరుగు దేశాలు చొరవ తీసుకుని వ్యాక్సిన్లు పంపిస్తామన్నా కూడా వద్దు పొమ్మన్నారు కిమ్. కానీ ఇప్పుడు పరిస్థితి చేయిదాటినట్టు కనిపిస్తోంది. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ మొదలు కాకపోతే ఉత్తర కొరియాలో కరోనా విజృంభణ మరింత పెరిగే అవకాశముంది. ఇతర దేశాల సహకారం తీసుకోకపోతే భారీ స్థాయిలో వైరస్‌ వ్యాప్తి, మరణాల ముప్పు తప్పదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా వ్యాధి చికిత్స ఔషధాలు కూడా లేవు. పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉన్నట్టు పొరుగు దేశాలు అంచనా వేస్తున్నాయి.