అనంతలో టీడీపీ వర్సెస్ టీడీపీ.. జేసీ-పల్లె వర్గాల మధ్య ఆధిపత్యపోరు..

టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నా కూడా.. పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో ఇప్పటి వరకు అవి బయటపడలేదు. తాజాగా.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి పర్యటనను స్వయానా ఆపార్టీ నేతలే అడ్డుకున్నారు. జేసీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మెడలో టీడీపీ కండువాలు వేసుకుని మరీ ప్లకార్డులు చేతబట్టుకుని జేసీకీ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పుట్టపర్తికి జేసీ వస్తే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉండటంతో.. పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

అసలు కథ ఏంటంటే..?
జేసీ సోదరులు, పల్లె రఘునాథరెడ్డికి మధ్య గతంలోనూ విభేదాలున్నాయి. అయితే ఇటీవల ఎవరి పని వారు చేసుకుంటున్నారు, ఎవరి ఏరియాలో వారు రాజకీయం చేస్తున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తిలో బాధితుల తరపున మాట్లాడటానికి వారిని పరామర్శించడానికి వస్తున్నట్టు ప్రకటించారు. పుట్టపర్తిలోని ఉజ్వల ఫౌండేషన్ భూకబ్జాలపు పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ. వారి అక్రమాల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు జేసీ పుట్టపర్తి వస్తానన్నారు. అయితే అక్కడ జేసీకి నోఎంట్రీ అని తేల్చి చెప్పారు పల్లె రఘునాథరెడ్డి. తన నియోజకవర్గంలోకి రావడానికి తాను పర్మిషన్ ఇవ్వాల్సిందేనన్నారు. తన అనుమతి లేకుండా పుట్టపర్తి ఎలా వస్తారని, బాధితుల్ని ఎలా పరామర్శిస్తారని ప్రశ్నించారు.

మంత్రి పదవికి అడ్డు వస్తాననేమో..?
తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూనే జేసీ, పల్లె వర్గాలు గొడవలకు దిగుతున్నాయి. ఉజ్వల ఫౌండేషన్ అక్రమాలను తాను వెలికి తీశానని, కలెక్టర్ కి ఫిర్యాదు చేశానని, ప్రభుత్వ అధికారుల నివేదిక ఆధారంగా బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు పల్లె రఘునాథరెడ్డి. న్యాయం జరగకపోతే తన నాయకత్వంలోనే ఉద్యమం మొదలవుతుందని స్పష్టం చేశారు. అంతే కానీ, తన నియోజకవర్గంలో జేసీ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు పల్లె. అయితే వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఒకే సామాజిక వర్గం కాబట్టి.. వచ్చేదఫా టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి విషయంలో తాను జేసీకి అడ్డు వస్తానని ఆయన అనుమానించి ఉండొచ్చని అన్నారు. టీడీపీకి కంచుకోటలా ఉన్న పుట్టపర్తిలో జేసీ వచ్చి చిచ్చురేపడం సరికాదన్నారు పల్లె. ఓవైపు పార్టీ భవిష్యత్తు కోసం అధినేత చంద్రబాబు అవస్థలు పడుతుంటే.. ఇటు అనంత అంతర్గత కుమ్ములాటలు హాట్ టాపిక్ గా మారాయి.