జూ.ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నేతకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

చంద్రబాబుకు కుప్పం పర్యటనకు వెళ్లిన ప్రతిసారి జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానుల నుంచి చికాకు ఎదురవుతూనే ఉంది. కొందరు జూనియర్ అభిమాన సంఘాల నేతలు యాక్టివ్‌గా అక్కడ ఉండడంతో చంద్రబాబు పర్యటన అనగానే జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం, పోటీగా ఫ్లెక్సీలు పెట్టడం వంటివి గత పర్యటనలో జరిగాయి. సొంత నియోజకవర్గంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకురావాలంటూ డిమాండ్‌ వస్తోందంటూ మీడియాలో పెద్దెత్తున ప్రచారం జరగడంతో.. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం సడలుతోందా అన్న చర్చకు అవకాశం ఇచ్చింది.

తాజా కుప్పం పర్యటనలో చంద్రబాబు.. ఈసారి జూనియర్‌ తరపు వ్యక్తులకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. ఆర్‌ అండ్ బీ గెస్ట్‌ హౌజ్‌లో చంద్రబాబు నిర్వహించిన ప్రజాదర్భార్‌ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత శివ వెళ్లారు. శివ ఒక పత్రికలో విలేకరి కూడా కావడంతో ఆ హోదాలో అక్కడికి వెళ్లారు. అతడిని గమనించిన చంద్రబాబు పీఏ మనోహర్.. ఇతడే సర్ కుప్పంలో మీ పర్యటనల సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా బ్యానర్లు కట్టేది అంటూ వివరించారు.

దాంతో చంద్రబాబు సదరు విలేకరి కం జూనియర్‌ అభిమాన నేతకు క్లాస్ తీసుకున్నారు. మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. అభిమానం వేరే, పార్టీ వేరు.. రెండు కలపొద్దు అని సూచించారు. పార్టీలో చీలకలు తేవడం మంచిది కాదంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. మరి చంద్రబాబు కుప్పం తదుపరి పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు ఉంటాయో లేదో చూడాలి.