దొంగ అని అనుమానించి దళితుడిని కొట్టి చంపేశారు !

 

మహారాష్ట్ర నవ్ ఘర్ జిల్లాలో ఓ పారిశుద్ద కార్మికుడిని జ్యువెలరీ షాపు యజమానితో సహా పది మంది కొట్టి చంపేశారు. కృష్ణ దుసామద్ (30) అనే పారిశుధ్య కార్మికుడు భయాందర్ లోని నాగమణి జ్యువెలర్స్ లో పారిశుద్దపని చేస్తున్నాడు. కృష్ణ దుసామద్ పనిలో ఉండగా జ్యువెలర్స్ యజమాని చండీచరణ్ బింద్ తో సహా అక్కడే పని చేస్తున్న మరో పది మంది అతనిపై దొంగతనం ఆరోపణలు చేస్తూ ఇనుప రాడ్లు, క్రికెట్ బ్యాట్లు, చెక్కలతో కొట్టారు.

తీవ్ర గాయాలపాలై అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయిన కృష్ణ దుసామద్ ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు లేకపోవడంతో మరొక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించాడు.

అదే బిల్డింగ్ లో పారిశుద్దపని చేస్తున్న కృష్ణ తండ్రి 64 ఏళ్ళ పలారం దుసామద్ అతని భార్య 60 ఏళ్ళ బిర్మతీదేవి, గాయపడిన తమ కుమారుడిని కార్లో తరలించడాన్ని చూసి పరుగు పరుగున ఆస్పత్రికి పరిగెత్తారు. అప్పటికే అతను మరణించాడని తెలుసుకొని పోలీసులకు పిర్యాదు చేశారు.

నవ్ ఘర్ పోలీసులు హత్య కేసు తో పాటు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని సెక్షన్‌లను జోడించారు. జ్యువెలర్స్ యజమాని చండీచరణ్ బింద్ తో సహా 11 మందిని అరెస్టు చేశారు.

తన కుమారుడిని అన్యాయంగా హత్య చేశారని, అనవసరంగా అతనిపై దొంగతనం ఆరోపణ చేయడమే కాక కొట్టి చంపడమేంటని ప్రశ్నించారు మృతుడి తండ్రి పలారం దుసామద్. ఆ షాపు యజమాని గతంలోనూ అనేక సార్లు తమను అవమానించాడని, అనేక రకాల వివక్షకు గురి చేశాడని ఆయన ఆరోపించారు.

మృతుడు కృష్ణ దుసామద్ కు 25 ఏళ్ళ భార్య ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.