దళితుల ఓట్లు చీల్చడానికి మరో కరివేపాకు పార్టీ

ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోందని రెండు పార్టీలు అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటుంటాయి. కానీ, చేతల్లో మాత్రం అది ఎక్కడా కనపడదు. ఎవరి పని వారిది, ఎవరి ప్రాధాన్యాలు వారివి. అయితే తాజాగా బీజేపీ, జనసేన పొత్తుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుకోసం పవన్ కల్యాణ్ వారివెంట పడుతున్నారని, ఆ మాట సాక్షాత్తూ అమిత్ షా నే తనతో చెప్పారని అన్నారు.

తెలంగాణలో తనపై జరిగిన దాడి విషయంలో అమిత్ షా కి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు కేఏపాల్. అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఓటుబ్యాంక్ లేని జనసేనతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందని తాను అమిత్ షా ని ప్రశ్నించినట్టు చెప్పారు పాల్. అయితే జనసేనే తమ వెంట పడుతోందని అమిత్ షా చెప్పినట్టు వివరించారు. తాము జనసేన వెంట పడటంలేదని, పవన్ కల్యాణే తమ వెంట పడుతున్నారని అమిత్ షా తనతో చెప్పారని అన్నారు పాల్.

ప్రజాశాంతి పార్టీ భవిష్యత్ రాజకీయాలు..
ప్రజాశాంతి పార్టీ భవిష్యత్ రాజకీయాలపై కూడా పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ మినహా అన్ని ఎంపీ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు పాల్. దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందని.. ప్రతిపక్ష స్థానాన్ని ప్రజాశాంతి పార్టీ భర్తీ చేస్తుందని చెప్పారు. ఏపీ, తెలంగాణ అప్పులపై కూడా తాను అమిత్ షా తో చర్చించినట్టు తెలిపారు పాల్. తనపై జరిగిన దాడిని అమిత్‌ షా తీవ్రంగా ఖండించారని అన్నారు.