బండి సంజయ్ పై పరువునష్టం దావా వేసిన కేటీఆర్..

48గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి లాయర్ నోటీసు అందింది. ఈమేరకు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన లాయరుతో నోటీసు ఇప్పించారు. అసలే ఉప్పు నిప్పులా ఉన్న టీఆర్ఎస్-బీజేపీ.. ఈ పరువు నష్టం దావా వ్యవహారంలో ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

అసలేం జరిగింది..?
ఈనెల 11న బండి సంజయ్ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారంలో కేటీఆర్ కి సంబంధం ఉంది అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారని, అవి తన క్లయింట్ పరువుకి భంగం కలిగించేలా ఉన్నాయంటూ ఆ నోటీసులో లాయర్ పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆధారాలుంటే 48గంటల్లోగా నిరూపించాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.

ఇటీవల బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ఆధారాలుంటే చూపించాలని కోరారు. అయితే సంజయ్ నుంచి స్పందన లేదు. ఆరోపణలు చేసిన తర్వాత ఆయన వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ లాయర్ నోటీసు ఇప్పించారు. పరువునష్టం దావా వేశారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నారు న్యాయవాది. జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా.. కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లయింట్ కేటీఆర్‌ కి ఆపాదించే దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. అసత్య వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు.