రోడ్డుపై కొట్టుకున్న కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి

నటి కరాటే కల్యాణి, ప్రాంక్ వీడియోలు చేసే యూట్యూబర్‌ శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు రోడ్డుపై కొట్టుకున్నారు. హైదరాబాద్‌ యూసఫ్‌గూడ మధురానగర్‌ రోడ్డుపై రాత్రి ఈ ఘటన జరిగింది. శ్రీకాంత్ రెడ్డి పలు ప్రాంక్‌ వీడియోలు చేస్తుంటారు. కరాటే కల్యాణిపై అతడు కొన్ని వీడియోలు చేసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిని నిలదీసేందుకు కరాటే కల్యాణి అతడి ఇంటి వద్దకు వెళ్లారు.

రోడ్డుపై ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. అంతలో కల్యాణి.. శ్రీకాంత్‌ చెంపపై కొట్టారు. కరాటే కల్యాణి వెంట వచ్చిన మరో వ్యక్తి కూడా శ్రీకాంత్‌ను కొట్టాడు. దాంతో శ్రీకాంత్ ఆగ్రహంతో కరాటే కల్యాణి, ఆమెతో పాటు వచ్చిన వ్యక్తిని పదేపదే తిరిగి చెంప మీద కొట్టాడు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

అనంతరం కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి పరస్పరం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్‌ వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి ఆరోపిస్తున్నారు. ప్రశ్నించినందుకు తనను కొట్టాడని ఆమె ఫిర్యాదు చేశారు. కరాటే కల్యాణి, ఆమెతో వచ్చిన మరో వ్యక్తి తనపైనా దాడి చేశారని శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశాడు.