2030 నాటికి భారత్ లో ఆహార సంక్షోభం..

భారత్ లో వాతావరణ మార్పులు, వాటి పర్యవసానాలు రాబోయే రోజుల్లో మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా వ్యవసాయ కమతాల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. ధాన్యం పండించే రైతుల సంఖ్య తగ్గిపోతోంది, ధాన్యం ఉత్పత్తి తగ్గిపోతోంది. అదే సమయంలో జనాభా సంఖ్య, వారు తీసుకునే ఆహార ఉత్పత్తుల పరిమాణం ఏమాత్రం తగ్గడంలేదు, సరికదా పెరుగుతోంది. దీంతో ఆహారం కొందరికి అందని ద్రాక్షగా మిగిలే ప్రమాదముందని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (IFPRI) హెచ్చరిస్తోంది. 2030నాటికి భారత్ లో తిండికోసం ఇబ్బందిపడేవారి సంఖ్య 7.39కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తోంది ఆ సంస్థ.

వాతావరణ మార్పులతో ఇప్పటికే ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిపోతోంది. మరోవైపు నగరీకరణతో సాగు భూములన్నీ, నివాస భూములుగా మారిపోతున్నాయి. ఎక్కడికక్కడ పంటపొలాలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోతున్నాయి. వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో రైతులు కూడా సాగుకి దూరమవుతున్నారు. కొంతమంది తిండిగింజల్ని పక్కనపెట్టి.. లాభసాటిగా మారే ఇతరత్రా ప్రత్యామ్నాయాలవైపు మొగ్గుచూపుతున్నారు. పర్యవసానంగా ఉత్పత్తి తగ్గిపోతోంది, డిమాండ్ పెరిగిపోతోంది. ఆహార ధాన్యాల రేట్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో పేదలకు ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండవు అని IFPRI అధ్యయనం తెలియజేస్తోంది.

ఉన్నతాదాయ వర్గాలు కూరగాయలు, పండ్లు, మాంసం.. ఇలాంటివాటని కోరుకుంటున్నాయి. మాంసం ఉత్పత్తి దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో 2030నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. 2050నాటికి అది మూడు రెట్లు పెరుగుతుంది. కానీ అదే సమయంలో పేదలకు మాత్రం ఆహారానికి కరువొస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50కోట్లమంది 2030నాటికి సరైన పోషకాహారం అందని స్థితికి చేరుకుంటారు. దీన్ని నివారించాలంటే.. ఆహార ఉత్పత్తి పెంచాలని, అది జరగాలంటే.. వాతావరణం అనుకూలించాలని చెబుతున్నారు. ఏడాదికేడాది వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు ఆహార సంక్షోభానికి కారణం అవుతున్నాయి.