బాబు, లోకేష్, పవన్ పై సీఎం జగన్ సెటైర్లు..

రాజకీయ నాయకుడు ప్రజల్ని నమ్ముకుంటాడని, కానీ చంద్రబాబు ప్రజల్ని కాకుండా.. లోకేష్ ని, పవన్ కల్యాణ్ ని నమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు సీఎం జగన్. మంత్రిగా పనిచేసి, మంగళగిరిలో ఓడిపోయిన సొంత పుత్రుడు ఒకరు.. రెండు చోట్ల పోటీ చేసి, ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు.. 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే రాజకీయ నాయకుడు ఇలాంటి వారిని నమ్ముకుంటున్నారంటూ సెటైర్లు పేల్చారు. తమ ప్రభుత్వంలో మంచి జరుగుతుంటే రాబందులు చూసి తట్టుకోలేకపోతున్నాయని, అలాంటి వారిని రాష్ట్ర ద్రోహులందామా.. దేశ ద్రోహులందామా? అని ప్రశ్నించారు. మత్స్యకార భరోసా కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

కుప్పం పరిగెత్తి ఇళ్లు కట్టుకుంటున్నారు..
27 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న పెద్దమనిషి చంద్రబాబుకి ఏనాడూ అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన లేదని, ఈరోజు జగన్‌ మూడేళ్ల పరిపాలన చూసి, కుప్పంకి పరిగెత్తి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు జగన్. గత ప్రభుత్వానికీ, ఈ ప్రభుత్వానికీ తేడా ప్రజలే గమనించాలని చెప్పారు. ప్రభుత్వంపై నిందలు వేయాలని దుష్ట చతుష్టయం కుటిల ప్రయత్నాలు చేస్తోందని, దేవుడే వాళ్లకు వైద్యం చేస్తాడని మండిపడ్డారు. ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా జగన్‌ అన్న వైద్యం చేయిస్తాడు కానీ, ఈర్ష్య, కడుపుమంటకు వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడని అన్నారు.

పరీక్ష పేపర్లు లీక్‌ చేయించే ప్రతిపక్షాన్ని మీరెప్పుడైనా చూశారా..? కార్మిక మంత్రిగా ఉంటూ ఉద్యోగులకు మంచి చేయాల్సింది పోయి, ఈఎస్‌ఐలో పౌడర్లు, స్నో, మందులు, టూత్‌ పేస్ట్‌ల పేరిట డబ్బులు కొట్టేసిన ప్రతిపక్షాన్ని మీరెప్పుడైనా చూశారా? కొడుక్కి అబద్ధాలు, మోసాల్లో శిక్షణ ఇస్తున్న చంద్రబాబులాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా? అంటూ ప్రశ్నించారు జగన్. ప్రభుత్వ పథకాల ద్వారా మూడేళ్లలో లక్షా 40వేల కోట్ల రూపాయలు పేదలకు అందించామని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 95శాతం అమలు చేశామని చెప్పారు. కానీ ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని, మా చంద్రబాబు మంచి చేశారని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి కూడా లేదని అన్నారు జగన్.