అఫీషియల్ : ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. బాహుబలి తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో హిందీ లోనూ సత్తా చాటిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఇప్పటికీ నార్త్ లో ఈ సినిమా థియేటర్ రన్ కొనసాగుతోంది. ఆశించిన స్థాయిలోనే వసూళ్లు వస్తున్నాయి.

కాగా ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా.. అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 కొనుగోలు చేసింది. తాజాగా ఆర్ఆర్ఆర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను జీ5 ఫిక్స్ చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ కానుంది. హిందీలో ఈ మూవీ థియేటర్ రన్ ఇంకా కొనసాగుతుండడంతో హిందీ మినహాయించి మిగతా అన్ని భాషల్లోనూ ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.

అయితే ఈ సినిమా ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చినా సబ్ స్క్రైబర్స్ కూడా కొంతమేర సొమ్ము చెల్లించి చూడాల్సి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అవేమీ నిజం కాదని తాజాగా క్లారిటీ వచ్చింది.జీ5 సబ్ స్క్రైబర్స్ ఈ సినిమాను ఉచితంగానే వీక్షించవచ్చు. థియేటర్లలో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ ఓటీటీ వీక్షణల్లో కూడా రికార్డులు నమోదు చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.