ఎట్టకేలకు ఓ సినిమా ఒప్పుకున్న సాయి పల్లవి..!

కేవలం కథాబలం ఉన్న చిత్రాల్లో మాత్రమే మొదటినుంచి నటిస్తోంది హీరోయిన్ సాయి పల్లవి. పారితోషికం అధికంగా ఇస్తామని చెప్పినా ఆమె తన పాత్ర నచ్చకపోతే మొహమాటంగా చేయనని సమాధానమిస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సాయిపల్లవి కెరీర్ మొదలై ఏళ్ళు గడుస్తున్నప్పటికీ అతి తక్కువ చిత్రాల్లో మాత్రమే నటించింది అంటే సెలెక్టెడ్ చిత్రాల్లో నటించడమే కారణం. సాయి పల్లవి ఒక సినిమా చేస్తుంది అంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉందని ప్రేక్షకులు ఒక అంచనాకు వస్తున్నారు.

కాగా, కొద్ది రోజులుగా సాయి పల్లవి కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోవడం లేదు. దీంతో ఆమె వివాహం చేసుకుంటోందని, అందుకే కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోవడం లేదని రూమర్స్ వచ్చాయి. అయితే అవేమీ నిజం కాదని చివరికి సాయి పల్లవి క్లారిటీ స్వయంగా ఇచ్చింది. సాయిపల్లవి చివరిగా నటించిన తెలుగు సినిమా శ్యామ్ సింగరాయ్. అలాగే తెలుగులో రానాతో కలిసి విరాటపర్వం అనే సినిమాలో నటించింది సాయి పల్లవి. ఈ సినిమా షూటింగ్ పూర్తయి కూడా సుమారు రెండేళ్లు కావస్తోంది. అప్పట్నుంచి మరే భాషలోనూ సాయి పల్లవి సినిమా ఒప్పు కోలేదు.

ఇన్ని రోజుల విరామం తర్వాత ఇప్పుడు సాయి పల్లవి కొత్తగా ఒక సినిమా చేసేందుకు అంగీకారం తెలిపింది. కోలీవుడ్ ప్రముఖ నటుడు కమలహాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దర్శకుడు రాజ్ కుమార్ పెరియ స్వామి. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి ని ఎంపిక చేశారు. తాజాగా ఈ విషయాన్ని రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

శివ కార్తికేయన్ ప్రస్తుతం డాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత శివ కార్తికేయన్ -సాయి పల్లవి కాంబోలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. చాలా రోజుల తర్వాత సాయి పల్లవి ఒక కొత్త సినిమాలో నటించేందుకు అంగీకారం తెలపడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.