ఐపీఎల్ -15లో నయాట్రెండ్!.. పరుగుల విజయాలలో సరికొత్త రికార్డు

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత ఐదువారాలుగా అలరిస్తూ వస్తున్న టాటా ఐపీఎల్ 15వ సీజన్ గ్రూప్ లీగ్ మ్యాచ్ లు దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం 10 జట్లు, 14 రౌండ్ల లీగ్ దశలో 11 రౌండ్ల మ్యాచ్ లు ముగిసి, కీలక 12వ రౌండ్ కు రంగం సిద్ధమయ్యింది.

కొత్తజట్ల టాప్ గేర్..
ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా తొలిసారిగా బరిలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, అహ్మదాబాద్ టైటాన్స్ జట్లు..10 జట్ల లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ వాకిట్లో నిలిచాయి. కెఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో ఇప్పటి వరకూ ఆడిన 11 రౌండ్లలో 8 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో 16 పాయింట్లు సాధించడం ద్వారా టాపర్ గా నిలిచింది. ఇక ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోని అహ్మదాబాద్ టైటాన్స్ 11 రౌండ్లలో 8 విజయాలు, 16 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. 11 రౌండ్లలో 7 విజయాలు, 14 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ మూడు, 12 రౌండ్లలో 7 విజయాలు, 14 పాయింట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు స్థానాలలో కొనసాగుతున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 11 రౌండ్లలో 5 విజయాలతో 10 పాయింట్ల చొప్పున సాధించి..5, 6 స్థానాలలోనూ, కోల్ కతా నైట్ రైడర్స్ 12 రౌండ్లలో 5 విజయాలు, 10 పాయింట్లతో 7వ స్థానంలోనూ నిలిచింది. 11 రౌండ్లలో 5 విజయాలతో పంజాబ్ కింగ్స్ 8, 11 రౌండ్లలో 4 విజయాలతో చెన్నై 9, ముంబై ఇండియన్స్ 11 రౌండ్లలో 2 విజయాలు, 4 పాయింట్లతో 10 స్థానాలలో మిగిలాయి.

పరుగుల విజయాల హోరు..
ఐపీఎల్ గత నాలుగు ( 53, 54, 55, 56 )రౌండ్ల మ్యాచ్ ల్లో టాస్ నెగ్గి.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే.. భారీ పరుగుల తేడాతో విజేతలుగా నిలవడం విశేషం. కోల్ కతా నైట్ రైడర్స్ పైన లక్నో సూపర్ జెయింట్స్ 75 పరుగుల తేడాతోనూ, సన్ రైజర్స్ హైదరాబాద్ పైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 67 పరుగుల తేడాతోనూ, ఢిల్లీ క్యాపిటల్స్ పైన చెన్నై సూపర్ కింగ్స్ 91 పరుగుల తేడాతోనూ, ముంబై ఇండియన్స్ పైన కోల్ కతా నైట్ రైడర్స్ 52 పరుగుల తేడాతోనూ విజయాలు నమోదు చేశాయి.

ముంబై చెత్త రికార్డు..
ఐపీఎల్ టైటిల్ ను ఐదుసార్లు నెగ్గిన ఒకేఒక్క జట్టు ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్ లీగ్ మొదటి 11 రౌండ్లలో 9 పరాజయాల రికార్డును మూటగట్టుకొంది. 2009, 2014, 2018 సీజన్లలో 8 పరాజయాల చొప్పున చవిచూసిన ముంబై 9 పరాజయాలు పొందటం ఇదే మొదటిసారి. ముంబై ప్రత్యర్థిగా ఆడిన గత మూడుమ్యాచ్ ల్లోనూ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టే విజేతగా నిలవడం ఇది రెండోసారి. ఇక..ముంబై వాంఖడే స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడిన మ్యాచ్ ల్లో ముంబై రెండో అత్యల్పస్కోరు ఇదే కావడం విశేషం. 2012 సీజన్లో 108 పరుగులకే కుప్పకూలిన ముంబై..ప్రస్తుత 2022 సీజన్ మ్యాచ్ లో
కేవలం 17.3 ఓవర్లలోనూ 113 పరుగులకే ఆలౌటయ్యింది.

బౌలర్లు భళా!
ప్రస్తుత సీజన్ లీగ్ లో బ్యాటర్లు మాత్రమే కాదు..బౌలర్లు సత్తా చాటుకోగలుగుతున్నారు. గత రెండుమ్యాచ్ ల్లో.. బెంగళూరు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ, ముంబై ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా 5 వికెట్ల ఘనతను సంపాదించగలిగారు. అయితే.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల రేస్ లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ అందరికన్నా ముందున్నాడు. ఇప్పటి వరకూ ఆడిన 11 రౌండ్ల మ్యాచ్ ల్లో చహాల్ 22 వికెట్లు పడగొట్టాడు. హసరంగ 12 రౌండ్లలో 21 వికెట్లతో రెండు, పంజాబ్ ఫాస్ట్ బౌలర్ కిగిసో రబాడా 10 రౌండ్లలో 18 వికెట్లతో మూడు, ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 12 రౌండ్లలో 18, హైదరాబాద్ పేసర్ నటరాజన్ 9 మ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టి టాప్ -5 బౌలర్లుగా కొనసాగుతున్నారు.