బుమ్రా బూమ్ బూమ్!.. 10 పరుగులకే 5 వికెట్ల రికార్డు

ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ బూమ్ బూమ్ బుమ్రా తనపేరును మరోసారి సార్ధకం చేసుకున్నాడు. తన ఐపీఎల్ కెరియర్ లో అత్యుతమ బౌలింగ్ రికార్డు నమోదు చేశాడు. ముంబై డీవీ పాటిల్ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన 11వ రౌండ్ పోరులో బుమ్రా చెలరేగిపోయాడు. నిప్పులు చెరిగే బౌలింగ్ తో 4 ఓవర్లలో ఓ మేడిన్ ఓవర్ తో పాటు కేవలం 10 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా విశ్వరూపం ప్రదర్శించినా బ్యాటింగ్ వైఫల్యంతో ముంబై 52 పరుగుల భారీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

హేమాహేమీల సరసన బుమ్రా..
అంతర్జాతీయ క్రికెట్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరుపొందిన బుమ్రాకు టెస్ట్, వన్డే మ్యాచ్ ల్లో 5 వికెట్ల రికార్డులు సాధించడం ఏమాత్రం కొత్తకాదు. అయితే..ఐపీఎల్ లో మాత్రం 5 వికెట్ల ఘనతను అందుకోడానికి ప్రస్తుత 15వ సీజన్ 56వ మ్యాచ్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది. కోల్ కతా వన్ డౌన్ ఆటగాడు నితీష్ రాణా, ఆల్ రౌండర్ యాండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్, యాండీ కమ్మిన్స్, సునీల్ నరైన్ ల వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే ఐదో అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నమోదు చేయడంతో పాటు మరో నలుగురు దిగ్గజాల వరుసలో నిలిచాడు.

అల్జారీ జోసెఫ్ అగ్రస్థానం..
2019 సీజన్లో అప్పటి ముంబై పేసర్ అల్జారీ జోసెఫ్ 12 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి.. అత్యుత్తమ బౌలర్ల వరుసలో అగ్రస్థానంలో నిలిచాడు. 2008 ప్రారంభ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ సోహెయిల్ తన్వీర్ 14 పరుగులిచ్చి 6 వికెట్లు, 2016 సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ లెగ్ స్పిన్నర్ ఆడం జంపా 19 పరుగులిచ్చి 6 వికెట్లు, 2009 సీజన్లో అనీల్ కుంబ్లే 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం ద్వారా మొదటి నలుగురు అత్యుత్తమ ఐపీఎల్ బౌలర్లుగా నిలిచారు. ఇప్పుడు బుమ్రా 10 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం ద్వారా ఐదో అత్యుత్తమ బౌలింగ్ నమోదు చేయగలిగాడు. ప్రస్తుత 15వ సీజన్ 11వ రౌండ్ వరకూ మొత్తం 117 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన బుమ్రా 140 వికెట్లు పడగొట్టాడు.