మరో సీరియస్ లుక్ లో అల్లరి నరేష్

కామెడీ చిత్రాల‌తో క‌డుపుబ్బా న‌వ్వించిన నేటి త‌రం కామెడీ స్టార్ అల్ల‌రి నరేష్‌. కామెడీ చిత్రాలే కాదు.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గమ్యం, నాంది, మహర్షి వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లోనూ న‌టించి న‌టుడిగా మెప్పించారాయ‌న‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. అల్లరి నరేష్ 59వ చిత్రమిది.

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, రిప‌బ్లిక్‌, బంగార్రాజు వంటి వ‌రుస స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ తో కలిసి, మ‌రో నిర్మాణ‌ సంస్థ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండు నిర్మాత‌. బాలాజీ గుత్త స‌హ నిర్మాత‌. ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పోస్టర్ గ‌మ‌నిస్తే.. నరేష్ మంచం ఓ చివరన పట్టుకుని ముందుకెళుతున్నట్లు కనిపిస్తుంది. అంటే నరేష్ ఎవరినో మోస్తున్నట్లు అనిపిస్తుంది. తలకు, చేతికి గాయాలు కనపడుతున్నాయి. ఇలా నరేష్ ఇంటెన్స్ లుక్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు. వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి ర‌వి మాటలు అందిస్తుండగా.. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నాడు.