మార్కుల కోసం దుర్మార్గం.. అడ్మిషన్ల కోసం కక్కుర్తి..

ఏపీలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీకి అసలు కారణాలను, కారకులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే నిబంధనల ప్రకారం మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసినట్టు తెలిపారు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి. ఈ కేసులో మొత్తం ఏడుగురు అరెస్ట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రి నారాయణ, తిరుపతిలోని నారాయణ సంస్థల డీన్ బాలగంగాధర్ కూడా ఉన్నారు. నారాయణ సతీమణిని అరెస్టు చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు ఎస్పీ. అరెస్టయినవారిని న్యాయస్థానంలో హాజరుపరిచి తదుపరి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు.

కారణం ఏంటంటే..?
ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీకి అసలు కారణం లాంగ్వేజెస్ లో మార్కులు పెంచుకోవడమేనని గుర్తించారు పోలీసులు. గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు జరగలేదు. ఈసారి పేపర్ల సంఖ్య కుదించి ప్యాట్రన్ మార్చారు. పిల్లల ప్రిపరేషన్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ దశలో తల్లిదండ్రుల్ని ఆకర్షించాలంటే పిల్లల మార్కులే ప్రధానం. అడ్మిషన్లు పెంచుకోవాలంటే టెన్త్ క్లాస్ గ్రేడులే ఆధారం. అందుకే టెన్త్ పేపర్ లీక్ చేసి అడ్డదారుల్లో ర్యాంకులు సాధించి అడ్మిషన్లు పెంచుకోవాలనేది యాజమాన్యాల దురాలోచన. దాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.

ఏప్రిల్ 27న టెన్త్ క్లాస్ తెలుగు పేపర్ లీకైన వ్యవహారంలో చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ లో కేసు నమోదైంది. వాట్సప్ గ్రూపుల్లో పేపర్ సర్క్యులేట్ అయిందని, డీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ముందుగా ఇన్విజిలేటర్ల వివరాలు సేకరించి, వారిలో డబ్బుకు అమ్ముడుపోయేవారిని గుర్తించి పక్కా ప్లాన్ ప్రకారం పేపర్ బయటకు తెప్పించి, తమ స్కూల్ విద్యార్థులకు ఆన్సర్లు చేరవేయబోయారని పోలీసులు నిర్ధారించారు. ఇన్విజిలేటర్లతో పేపర్ బయటకు తెప్పిస్తున్నారు. ఆ తర్వాత అటెండర్లు, వార్డ్ బాయ్స్ తో ఆన్సర్లు లోపలికి పంపించాలని చూశారు. అయితే ఈ కేసులో పట్టుబడినవారంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవారిగా పోలీసులు గుర్తించారు. విచారణలో ఈ కుట్రకు ప్రధాన కారణం నారాయణ విద్యాసంస్థలేనని తేలిందని చిత్తూరు ఎస్పీ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మిగతా విద్యా సంస్థల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు.