కెప్టెన్ గా ధోనీ పరిణతి.. అది జరుగకపోయినా నష్టంలేదు!.. సారధిగా 6వేల పరుగుల జార్ఖండ్ డైనమైట్

ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లోపల మాత్రమే కాదు.. గ్రౌండ్ వెలుపలా ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్నాడు. నాలుగు పదుల వయసులో చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తున్న ధోనీ.. ప్రస్తుత సీజన్లో తమ జట్టు దుస్థితిని చూసి తనదైన శైలిలో స్పందించాడు. రవీంద్ర జడేజా నుంచి జట్టు పగ్గాలు చేపట్టిన ధోనీ నాయకత్వంలో ఆడిన మూడుమ్యాచ్ ల్లో రెండుసార్లు చెన్నై 200కు పైగా స్కోర్లు సాధించడం, విజయాలు నమోదు చేయడం విశేషం. అయితే.. 10 జట్లు, 14 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ లో చెన్నై ఇప్పటి వరకూ ఆడిన 11 రౌండ్లలో 4 విజయాలు, 7 పరాజయాలతో 8 పాయింట్లతో లీగ్ టేబుల్ 8వ స్థానంలో కొనసాగుతోంది. చివరి మూడురౌండ్లలో నెగ్గినా ప్లేఆఫ్ రౌండ్ చేరడం చెన్నైకి అంతతేలిక కాదు.

ప్లే-ఆఫ్ చేరకపోయినా నష్టలేదు..
తమజట్టు ప్లేఆఫ్ రౌండ్ చేరకపోతే వచ్చిన నష్టం ఏమీలేదని, ఆలస్యంగా ఫామ్ లోకి రావడం కారణంగానే అవకాశాలను క్లిష్టంగా మార్చుకొన్నామని.. ఢిల్లీ క్యాపిటల్స్ పైన భారీ విజయానంతరం మాట్లాడుతూ ధోనీ చెప్పాడు. ఒకేవేళ తమజట్టు ప్లేఆఫ్ రౌండ్ చేరకుండానే నిష్క్రమించినా.. ఇంతటితోనే ఏదీ ముగిసిపోదని.. ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కాబోదని తేల్చి చెప్పాడు. ధోనీ నాయకత్వంలో గత 14 సీజన్లలో 10సార్లు ప్లేఆఫ్ రౌండ్ చేరడంతో పాటు..నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నైకి అత్యంత విజయవంతమైన రెండుజట్లలో ఒకటిగా పేరుంది. ప్రస్తుత సీజన్ లీగ్ లో ఐదుసార్లు విజేత ముంబై టేబుల్ అట్టడుగున కొట్టిమిట్టాడుతుంటే..చెన్నై 8వ స్థానానికి పరిమితమయ్యింది. ఈ రెండు దిగ్గజట్ల ప్లేఆఫ్ ఆశలు ఇప్పటికే ఆవిరైపోయాయి.

కెప్టెన్ గా 6వేల పరుగుల ధోనీ..
టీ-20 చరిత్రలో కెప్టెన్ గా 6వేల పరుగులు సాధించిన ఇద్దరు క్రికెటర్లలో ఒకనిగా మహేంద్రసింగ్ ధోనీ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన 11వ రౌండ్ పోరులో 21 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడం ద్వారా.. 6వేల పరుగుల మైలురాయిని చేరగలిగాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కమ్ భారత కెప్టెన్ గా విరాట్ కొహ్లీ గతంలోనే 6వేల పరుగులు సాధించిన తొలి సారధిగా చరిత్ర సృష్టించాడు. కొహ్లీ 190 మ్యాచ్ ల్లో ఐదుశతకాలు, 48 అర్థశతకాలతో సహా మొత్తం 6వేల 451 పరుగులు సాధించాడు. 43.28 సగటు సైతం నమోదు చేశాడు. ధోనీ మాత్రం మొత్తం 303 మ్యాచ్ ల్లో 23 హాఫ్ సెంచరీలతో 6వేల పరుగులు నమోదు చేయగలిగాడు. ధోనీ సగటు 38.57గా ఉంది.