రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నితిన్

నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడు.

ఈ చిత్రాన్ని ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని పనులు పెండింగ్ లో ఉండడం వల్ల సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆగస్ట్ 15 హాలిడే ఈ చిత్రానికి కలసిరానుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నితిన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ జీన్స్ వైట్ షర్టులో నితిన్ సాలిడ్ గా కనిపించాడు. స్టయిలిష్ గా కనిపిస్తూనే మాస్ యాక్షన్ లుక్స్ తో దూకుడు చూపించాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పాటల్ని, ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు.

పొలిటికల్ నేపధ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడు.