వివాదంలో సీనియర్ నటి సుహాసిని..!

ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే సీనియర్ నటి సుహాసిని ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. హిందీ చాలా మంచి భాష అని..ఆ భాషను మాట్లాడే వారంతా చాలా మంచి వారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. సుహాసిని వ్యాఖ్యలపై తమిళ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుహాసిని మాట్లాడుతూ..తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలు.. నాణ్యతలో అద్భుతంగా ఉన్నాయని, కన్నడ సినిమాలు కూడా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

సినీ నటులకు అన్ని భాషల్లోనూ ప్రావీణ్యం ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా భాష గురించి ఆమె ప్రస్తావిస్తూ..’ అన్ని భాషలను గౌరవించాలి. అన్ని భాషలను సమానంగా చూడాలి. హిందీ మంచి భాష. దాన్ని నేర్చుకోవాలి. హిందీ మాట్లాడే వారు ఎంతో మంచి వారు. వారితో మాట్లాడటం కోసం హిందీ నేర్చుకోవాలి. తమిళులు కూడా ఎంతో మంచి వారే. మీకు ఎన్ని భాషలు తెలిస్తే మీరు అంత సంతోషంగా ఉంటారు. మాకు ఆ భాషే కావాలి.. అని అంటే తిండి కూడా దొరకదు. అందుకే అందరూ అన్ని భాషలను నేర్చుకోవాలి.’ అని సుహాసిని కామెంట్స్ చేశారు.

మామూలుగానే తమిళనాడు ప్రజలకు తమ భాష పైన ప్రేమ ఎక్కువ. హిందీ భాష అంటే వారికి అసలు నచ్చదు. పాఠశాలల్లో హిందీ నేర్పడానికి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఆసక్తి చూపించడం లేదు. తమపై హిందీ భాష రుద్ద వద్దంటూ కేంద్రంపై తమిళనాడు ప్రజలు ఎన్నో సార్లు పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్న తమిళనాడులో సుహాసిని హిందీ భాషను పొగడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందీ పై అంత అభిమానం ఉంటే అక్కడికే వెళ్లి సినిమాలు చేసుకోవాలని సుహాసినిపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.